Site icon HashtagU Telugu

Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం

Free Bus Scheme

Free Bus Scheme

Free Bus Scheme: తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. దానిని ప్రధాని మోడీ జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందే ప్రక్రియలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.“మేము రూట్ల సంఖ్యను పెంచుతాము. అలాగే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతాయి. ఉచిత బస్‌ పథకం అంటే నష్టాలేనంటూ ప్రధాని మాట్లాడడం సరికాదన్నారు. ఇలాంటి పనికిమాలిన విషయాలపై వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన తన కార్యాలయ స్థాయిని దిగజార్చకూడదని పొన్నం ప్రభాకర్ సూచించారు.

ఇండియా టుడేతో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఒక నగరంలో మెట్రోను నిర్మించి, ఆపై ఎన్నికల్లో గెలవడానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రకటించారు. అంటే యాభై శాతం మంది మెట్రో ప్రయాణికులను మీరు మెట్రోకు దూరం చేశారు. కాబట్టి మెట్రో నడపడం సాధ్యం కాదని మోడీ చేసిన కామెంట్స్ పై పలు రాష్ట్రాలు ఖండిస్తున్నాయి. ఉచిత బస్సు పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లు ఈ అంశంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు హామీ ఇచ్చే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకిస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఉచిత విమాన ప్రయాణం వల్ల మోదీ, ఇతర మంత్రులు లబ్ధి పొందుతున్నప్పుడు మహిళలకు ఉచిత బస్సు యాత్రను నిరాకరించడం వెనుక లాజిక్ ఏంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Also Read: Sundar Pichai : టాప్ టెక్ జాబ్స్ కోసం ‘త్రీ ఇడియట్స్’ ఫార్ములా : సుందర్ పిచాయ్