Telangana Politics: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పోరాటం చేస్తుందన్న ప్రధాని మోదీ.. మరి అడ్డుపడుతోంది ఎవరు?

తెలంగాణ అభివృద్ధికి పోరాటం చేస్తామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనడంపై బీజేపీ మినహా ఇతర పార్టీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Modi

Modi

తెలంగాణ అభివృద్ధికి పోరాటం చేస్తామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనడంపై బీజేపీ మినహా ఇతర పార్టీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అధికారం అంతా వారి చేతుల్లో పెట్టుకుని ఇప్పుడు తెలంగాణ ప్రగతికి ఎవరిపై పోరాటం చేస్తారని ప్రశ్నిస్తున్నాయి? తెలంగాణకు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వమే. ఇప్పుడు దానిని మళ్లీ ఇవ్వాల్సింది కేంద్రమే. అక్కడ అధికారంలో ఉన్నది మోదీ ప్రభుత్వమే. ఇక ఆ ఫైల్ పై సంతకం పెడతానని నరేంద్రమోదీ అంటే ఎవరైనా అడ్డు చెప్పగలరా? అలాంటప్పుడు ఎవరిపై పోరాటం చేస్తారంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.

తెలంగాణలో అభివృద్ధికి పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర నేతలు చెబితే అర్థముంది. వాళ్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని అభ్యర్థించి.. తెలంగాణకు కావలసిన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల్లో కేటాయింపుల పెంపు లాంటివి సాధించుకోవచ్చు. అలాంటిది నిర్ణయాధికారాలు తన వద్దే పెట్టుకుని మోదీ అలా ఎలా అంటారంటూ మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో మోదీ మాటలు చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణలో కాజీపేటకు రావలసిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తీసుకెళ్లింది ఎవరు? భువనగిరిలో ఎయిమ్స్ కు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సింది ఎవరు? పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను ఇవ్వాల్సింది ఎవరు? ఆయుష్ ను చివరి నిమిషంలో గుజరాత్ కు తరలించుకుపోయింది ఎవరు? నిజానికి మోదీ తలచుకుంటే ఒక్క సంతకంతో ఇవన్నీ తెలంగాణలో ఏర్పాటు చేయచ్చు. అభివృద్ధి చేయచ్చు. కానీ అలా చేయలేదు సరికదా వాటి ఏర్పాటు కోసం పోరాటం చేస్తామంటున్నారు.

నరేంద్రమోదీ తలచుకుంటే.. ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ఇవన్నీ తెలంగాణకు ఇవ్వడానికి కచ్చితంగా అవకాశం ఉంది. కానీ వాటిని ఇవ్వాల్సిన వారే ఇలా మాట్లాడితే ఎలా అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. పైగా ఇది ఎన్నికల సమయం కూడా కాదు. అయినా మోదీ ఇలా వ్యాఖ్యానించారంటే కచ్చితంగా ఇది దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలను ఆశించే అయ్యుంటుందంటున్నారు విశ్లేషకులు.

  Last Updated: 27 May 2022, 02:51 PM IST