Telangana BJP: ‘బండి’ భుజం తట్టి అభినందించిన ‘మోదీ’… ఈటలకు దక్కిన మోదీ ప్రశంస…!!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పరుగులు పెట్టిస్తూ... కేసీఆర్ పై యుద్దం చేస్తున్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ ఎండగడుతూ...

  • Written By:
  • Publish Date - February 6, 2022 / 10:20 AM IST

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పరుగులు పెట్టిస్తూ… కేసీఆర్ పై యుద్దం చేస్తున్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ ఎండగడుతూ… తనదైన శైలిలో దూసుకుపోతూ… పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారాయన. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన అంశంలో వారికి మద్ధతుగా దీక్ష చేసిన బండి, అరెస్ట్ కూడా అయ్యారు. జైలుకి వెళ్లి వచ్చారు. నిరుద్యోగులు, రైతులు… ఇలా ఒకటేమిటి, అనేక అంశాల్లో సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పాదయాత్ర కూడా చేశారు. జీవో నెం.317 ను సవరించాలని డిమాండ్ చేస్తూ…. దీక్షలో ఉండగా అరెస్ట్ కూడా అయ్యారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే. ఇదే విషయంలో దేశ ప్రధాని మోదీ సైతం బండి సంజయ్ కి కాల్ చేసి, దాదాపు 15 నిమిషాలు పాటు మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్ ఇలా ఒక స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ తో 15 నిమిషాలు ఫోన్ లో మాట్లాడడం భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే లేదు. దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు, బండి సంజయ్ కి బీజేపీ ఎంతటి ప్రయారిటీ ఇస్తుందో అనేది.

ఇకపోతే, ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టి మరీ పలకరించారు. ‘క్యా బండీ.. కైసే హై’అంటూ కుశల ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న బండిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి బయలుదేరే సమయంలో ఈటల రాజేందర్ ను కూడా అభినందించారు మోదీ. బండి సంజయ్ ప్రధాని మోదీకి ఈటలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన భుజం తట్టిన మోదీ.. ‘చోటా ఆద్మీ బడా కామ్ కర్‌ రే’అని ప్రశంసించారు. దీంతో ఈటల రాజేందర్ ఫుల్ ఖుషీ అయ్యారు. కాగా, రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు బయలుదేరిన మోదీకి… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జితేందర్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ వీడ్కోలు పలికారు.