PM Modi : ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ సహా ఇతర ఉన్నతాధికారులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ఆదేశించారు. ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు కేంద్ర కేబినెట్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై కమిటీని ప్రకటించేందుకు చకచకా సన్నాహాలు చేస్తున్నారు. బహుశా తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ కంటే ముందే ఈ కమిటీపై కేంద్ర సర్కారు నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో ఎస్సీ ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకున్న బీజేపీ.. ఎన్నికల వేళ ఈ కీలక అంశాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ ఎస్సీ వర్గీకరణపై ఫోకస్ చేసింది. దీనిలో భాగంగా ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారతను కల్పించేలా ఎస్సీ వర్గీకరణ చేయడంలో సహకరిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనిపై మరింత ముందడుగు వేసేలా ప్రధాని మోడీ ఇవాళ చొరవ తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లలోని షెడ్యూల్డ్ కులాలలో మాదిగలు పెద్ద భాగం. రిజర్వేషన్లు, ఇతరత్రా ఫలాలు తమకు అందలేదనే కారణంతో మందకృష్ణ మాదిగ సారథ్యంలోని ఎంఆర్‌పీఎస్ గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం(PM Modi) పోరాడుతోంది.