PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు చెందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డికి అభినందనలు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రద్ధతో ప్రజల మధ్య ఉంటూ ఎంతో అభ్యర్థుల విజయానికి శ్రమించిన మా పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను అని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్‌ను ప్రధాని మోడీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
Read Also: Hijab Song: హిజాబ్‌పై సాంగ్.. సింగర్‌కు 74 కొరడా దెబ్బలు
కాగా, తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల ఫలితాలు రెండు రోజుల క్రితమే వచ్చేశాయి. రాత్రి మూడో స్థానం ఫలితం వచ్చింది. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గపు ఎమ్మెల్సీలుగా బీజేపీ అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు. కొమరయ్య విజయం రెండు రోజుల క్రితమే ఖరారుకాగా, పట్టభద్రుల ఫలితం బుధవారం వెలువడింది. కాగా, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్లతో అంజిరెడ్డి గెలుపొందారు. రెండు రోజుల పాటు జరిగిన కౌంటింగ్ ప్రక్రియ అడుగడుగునా ఉత్కంఠ రేపింది. బీజేపీ-కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ‘నువ్వానేనా’ అన్నట్టుగా గెలుపు దోబూచులాడింది. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పట్టభద్రుల స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోలయ్యాయి.
ఇందులో 28,686 ఓట్లు చెల్లలేదు. వీటిలో 75,675 బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి, 70,565 కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి, 60,419 ఓట్లు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. అయితే నిబంధనల ప్రకారం మొదటి ప్రాధాన్యతలోనే 1,11,672 ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలి. కానీ మొదటి ప్రాధాన్యంలో ఏ అభ్యర్థికి కూడా అన్ని ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించారు. మొత్తం 56 మంది పోటీచేయగా, రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించేందుకు గాను 54 మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. చివరకు బీజేపీ అభ్యర్థికే అత్యధిక ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాకపోయినా 5వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం ఉండడంతో మూడో ప్రాధాన్యానికి వెళ్లకుండా అంజిరెడ్డి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.
ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలవాలని చెప్పి తీవ్రంగా శ్రమించింది.ఇందులో ఒకటి సిట్టింగ్ స్థానం కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేశారు. అయిన పరాభవం తప్పలేదు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పడలేదని అంటున్నారు. అధికారంలో ఉండి కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇక అదే టైంలో బీజేపీకి నేతలకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. భవిష్యత్ మాదే అని ప్రచారం చేస్తున్నట్టుగానే ప్రజలు తీర్పు ఇవ్వడం వారి వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
Read Also: Secret Service Agent: 13 ఏళ్ల కుర్రాడికి కీలక పదవిచ్చిన ట్రంప్.. ఎందుకు ?