తాజా టీఆర్ఎస్ నేతపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు

మాజీ ఐఏఎస్, తాజా టీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.

  • Written By:
  • Publish Date - November 19, 2021 / 12:02 AM IST

మాజీ ఐఏఎస్, తాజా టీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.

వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సురేందర్ సింగ్, శంకర్‌ అనే పరిశోధక విద్యార్థులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారి రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారని, అలాంటప్పుడు వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఎలా ఆమోదిస్తారని అన్నారు. వెకంట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌‌ను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

ఎన్నికల కమీషన్ ని, శాసన మండలి కార్యదర్శిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ పిల్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే ఈ పిల్‌పై అత్యవరసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.

మరోవైపు తెలంగాణ పీసీసీ నాయకులు కూడా వెంకట్రామిరెడ్డిపై శాసనమండలి రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఐఏఎస్‌గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని మండలి రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఆరోపణలను, భూసేకరణలో హైకోర్టు ఆయనకు శిక్ష విధించిన విషయంతో పాలు పలు అంశాలతో కాంగ్రెసు పార్టీ ఓ నివేదిక తయారు చేసింది. ఆ నివేదికను జతచేస్తూ ఎన్నికల అధికారికి తెలంగాణ కాంగ్రెసు ఫిర్యాదు చేసింది. ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని అందులో విజ్ఞప్తి చేసింది.