Site icon HashtagU Telugu

Prashant Kishore Strategy : కేసీఆర్ కు `పీకే` స్వ‌స్థ‌త‌

Kcr Prashant Kishor

Kcr Prashant Kishor

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ర‌చించే వ్యూహాలు తొలి రోజుల్లో కొత్త‌గా క‌నిపించేవి. ఇప్పుడు ఆయ‌న వ్యూహాలు ఎలా ఉంటాయో..తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగా తెలిసి పోయింది. ఆయ‌న్ను తెలుగు రాష్ట్రాల‌కు ఒక విల‌న్ మాదిరిగా చూస్తున్నారు. భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ద్వారా ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెడతార‌ని ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. కేసీఆర్ కు స్వ‌ల్ప అస్వ‌స్థ కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరిన‌ప్ప‌టి నుంచి పీకే గ‌త‌ రాజ‌కీయ వ్యూహాల ప్ర‌స్తానాన్ని అవ‌లోక‌నం చేసుకుంటున్నారు.ఇటీవ‌ల మోడీకి ప్ర‌త్యామ్నాయం కోసం ఢిల్లీ నుంచి తెలంగాణ వ‌ర‌కు రాజ‌కీయ వ్యూహాల‌ను పీకే ర‌చించాడు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుంద‌నే స‌ర్వే రిపోర్టుల‌ను కేసీఆర్ కు చూపించాడ‌ట‌. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను కూలంకుషంగా చెప్ప‌డం కార‌ణంగా ఉద్యోగాల భ‌ర్తీ షురూ అయింద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల భావ‌న‌. కానీ, అంచనాల‌కు భిన్నంగా ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు రావ‌డంతో పీకే త‌న పంథాను మార్చేశాడ‌ట‌. తెలంగాణ సీఎం కేసీఆర్ ను దేశ వ్యాప్తంగా సింహంలా ఫోక‌స్ చేయాల‌ని తొలుత వ్యూహం ర‌చించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఫ్రంట్ రూపంలో ఢిల్లీ పీఠం వ‌ర‌కు తీసుకెళ్ల‌డానికి పావులు క‌దిపాడు.

గ‌తంలోని పీకే వ్యూహాల‌ను గ‌మ‌నిస్తే, తొలుత లీడ‌ర్ల‌ను హీరోలుగా ఫోక‌స్ చేస్తాడు. ఏ మాత్రం టెంపో త‌గ్గ‌కుండా ఏ రోజుకారోజు వ్యూహాల‌ను ప‌న్నుతుంటాడు. ఒక వేళ అందుకు భిన్న‌మైన ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు సానుభూతి అస్త్రాన్ని వెతుకుతాడు. స‌రిగ్గా 2014 ఎన్నిక‌ల్లో కూడా మోడీకి అలాంటి వ్యూహాల‌ను అందించాడు. భార‌త దేశానికి మోడీ మిన‌హా మ‌రెవ‌రూ లేరంటూ హైలెట్ చేసేలా సోష‌ల్ మీడియాలో ఫోక‌స్ పెట్టాడు. ఆనాడు కాంగ్రెస్ కుంభ‌కోణాల‌ను హైలెట్ చేస్తూ మోడీ దేశ‌భ‌క్తిని ఎలివేట్ చేశాడు. భార‌త‌దేశాన్ని స‌మూలంగా మార్చేసే రాజ‌కీయ హీరోలా మోడీని చూపించాడు. ఎన్నిక‌ల స‌మ‌యంలో పాకిస్తాన్ అంశాన్ని ప్రొజెక్టు చేశాడు. ఫ‌లితంగా 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న వ్యూహం ఫ‌లించింది.
2017 యూపీ ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీని హీరోలా చూపాల‌ని పీకే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, ఆ ఎన్నిక‌ల్లో పేట్ పే చ‌ర్చ రాహుల్ ను జీరో చేసింది. దాంతో యూపీలో అల‌జ‌డి రేపాల‌ని వ్యూహాల‌ను ర‌చించాడ‌ని ప్ర‌త్య‌ర్థులు ఆనాడు చెప్పుకున్నారు. ముస్లిం, హిందూ వ‌ర్గాల మ‌ధ్య గ్యాప్ పెంచేలా ప్ర‌య‌త్నం చేయ‌డంతో బూమ్ రాంగ్ అయింది. ఆ అనుభ‌వంతో ఏపీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కోసం సానుభూతి వ్యూహాన్ని కోడి క‌త్తి రూపంలో ర‌చించాడ‌ట‌. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సీఎం అయ్యాడు. అదే వ్యూహాన్ని బెంగాల్ లోనూ అమ‌లు చేశాడ‌ని టాక్‌. ఎన్నిక‌ల ప్ర‌చార వేదిక‌పై మ‌మ‌త‌కు ప్ర‌మాదం జ‌రిగి కాలు విరిగింది. క‌ట్టుక‌ట్టుకుని ప్ర‌చారం చేయ‌డంతో సానుభూతి ప‌వనాలు స‌హ‌జంగా వీశాయి. దీంతో మూడోసారి సీఎం గా దీదీ ప్ర‌మాణం చేసింది. ఇప్పుడు అదే త‌ర‌హా వ్యూహాన్ని తెలంగాణ‌లోనూ అమలు చేయడానికి పీకే సిద్ధ‌మ‌య్యాడ‌ని విప‌క్ష లీడ‌ర్లలోని గుస‌గుస‌లు.

కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ఫ్రంట్ కు హీరోగా కేసీఆర్ ను చూపాల‌ని పీకే ఎత్తుగ‌డ‌లు ర‌చించాడు. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏకాంతంగా గంట‌ల కొద్దీ చ‌ర్చించాడు. అంతేకాదు, ప్ర‌కాష్ రాజ్ తో క‌లిసి కొన్ని వ్యూహాల‌ను ప‌న్నాడట‌. ఢిల్లీ పీఠం దిశ‌గా దూకుడుగా కేసీఆర్ ను తీసుకెళ్లాడు. ప్రాథ‌మిక వ్యూహాలు ఫ‌లిస్తున్నాని పీకే టీం ఉత్సాహం పనిచేస్తోన్న స‌మ‌యంలో ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు పిడుగులా మారాయి. దీంతో సానుభూతి వ్యూహాన్ని పీకే బ‌య‌ట‌కు లాగాడని ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌. ఆ క్ర‌మంలోనే కేసీఆర్ ఆస్ప‌త్రి పాల‌య్యాడ‌ని విప‌క్ష పార్టీలకు చెందిన కొంద‌రు లీడ‌ర్లలోని వినికిడి.ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజ‌కీయాల‌ను మార్చేయ‌బోతున్నాయ‌ని చాలా మంది అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌త్యేకించి టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు, ఎంపీలు ర‌హ‌స్యంగా స‌మావేశాల‌ను నిర్వ‌హించుకుంటున్నార‌ని టాక్‌. సుమారు 45 మంది ఎమ్మెల్యేలు, 12 ఎంపీలు ట‌చ్ లో ఉన్నార‌ని దుబ్బాక ఉప ఎన్నిక‌ల నుంచి తెలంగాణ బీజేపీ చెబుతోంది. ఏ రోజైనా కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి భారీగా వ‌ల‌స ప్రారంభం అవుతుంద‌ని రాజ‌కీయ అనుభ‌వ‌జ్ఞులు అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి ప‌రిణామానికి బ్రేక్ వేయ‌డానికి పీకే వ్యూహాన్ని ర‌చించాడ‌ట‌. బీజేపీ ఐదు రాష్ట్రాల హ‌వా కొన‌సాగిస్తూ వ‌చ్చిన ఫ‌లితాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి సానుభూతి వ్యూహాన్ని పీకే బ‌య‌ట‌కు తీశాడ‌ని ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు.

బెంగాల్‌, ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పీకే రచించిన వ్యూహాలు రాజ‌కీయాల‌తో ప‌రిచ‌య‌మున్న ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిన‌వే. కుల‌, మ‌త ప్రాతిప‌దిక‌న ఓట‌ర్ల‌ను విభ‌జించ‌డం ఆయ‌న ఎత్తుగ‌డ‌ల్లోని మొద‌టిది. స‌మాజంలో ఉద్రిక్త‌త‌ల‌ను లేప‌డం ద్వారా ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను ఓట్ల రూపంలోకి తీసుకురావ‌డం రెండో ఎత్తుగ‌డ‌. సానుభూతి కోసం ఏదో ఒక ప్ర‌మాదాన్ని అవ‌కాశంగా తీసుకుని ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెల‌వ‌డం మూడో ఎత్తుగ‌డ‌గా భావిస్తున్నారు. అందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నంగా ఏపీ, బెంగాల్ ఎన్నిక‌ల వ్యూహాల‌ను ఉద‌హ‌రిస్తున్నారు. అందుకే, తెలంగాణ ప్ర‌జ‌లు పీకే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా కేసీఆర్ కు ఉంటాడ‌ని తెలియ‌గానే అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆయ‌న్ను క్షేత్ర‌స్థాయిలో వేటాడేందుకు కూడా కొంద‌రు సిద్ధమ‌య్యార‌ని సోష‌ల్ మీడియా పోస్టుల ఆధారంగా స్ప‌ష్టం అవుతోంది. సో..అలాంటి ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా పీకే ఉంటాడా? ఐదు రాష్ట్రాల ఫ‌లితాల దెబ్బ‌కు దూరంగా అవుతాడా? అనేది చూడాలి.