Site icon HashtagU Telugu

Schools Reopen : ఇదేం లాజిక్ కేసీఆర్‌.!

Schools Kcr

Schools Kcr

కోవిడ్ నియంత్ర‌ణ విష‌యంలో మొద‌టి నుంచి కేసీఆర్ స‌ర్కార్ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. మొద‌టి, రెండు, మూడో వేవ్ లోనూ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని హైకోర్టు ప్ర‌శ్నిస్తోంది. తాజాగా ఫిబ్ర‌వ‌రి నుంచి స్కూల్స్ ప్రారంభించాల‌ని భావించ‌డం కూడా తెలంగాణ స‌ర్కార్ అనాలోచిత చ‌ర్య‌గా చూడాల్సి ఉంటోంది. ఒక వైపు కాలేజీలు, యూనివ‌ర్సిటీల‌కు సెల‌వుల‌ను ప్ర‌కటించిన కేసీఆర్ స‌ర్కార్ స్కూల్స్ ను ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ విద్యార్థులు హాస్ట‌ల్స్ ఖాళీ చేసి వెళ్లాల‌ని ఆదేశించింది. తెలంగాణ‌లోని మిగిలిన యూనివ‌ర్సిటీల్లో చ‌దువుకునే విద్యార్థుల‌ను సొంత ఊళ్ల‌కు వెళ్లాల‌ని సూచించింది. కాలేజిల‌ను మూసి వేసి సెల‌వుల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను క్లోజ్ చేసింది. కానీ, ప్ర‌భుత్వం, ప్రైవేటు స్కూల్స్ ను ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి తెర‌వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించ‌డం దేనికి సంకేతం అనేది కేసీఆర్ స‌ర్కార్ చెప్పాలి.

తెలంగాణ ప్ర‌భుత్వం స్కూల్స్ ప్రారంభంపై తీసుకున్న నిర్ణ‌యాన్ని హైకోర్టు త‌ప్పుబ‌డుతోంది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ మరియు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన డివిజన్ బెంచ్ కోవిడ్‌ -19 పై వేసిన పిల్స్ మీద విచార‌ణ జ‌రిపింది. కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌పై నివేదిక ఇవ్వాల‌ని కోరింది. బాధితుల‌కు అందుతోన్న స‌హాయంపై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. బజార్‌లలో ప్రజల రద్దీని తగ్గించడానికి తీసుకున్న చ‌ర్య‌లు ఏమిటో చెప్పాల‌ని నిల‌దీసింది. కోవిడ్ ప్రోటోకాల్స్, ఫేస్ మాస్క్‌ల వాడకం, సామాజిక దూరంతో సహా ప్రస్తుతం క‌రోనా బారీన ప‌డిన‌ పెద్దలకు ఇస్తున్న స‌హాయంపై ప్ర‌శ్నించింది. వాళ్ల‌కు సాధార‌ణ‌ మెడికల్ కిట్లను సరఫరా చేయడం మంచిది కాదని, కోవిడ్ బాధిత పిల్లలకు ప్రత్యేక మెడికల్ కిట్‌లను అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెల‌పాల‌న ధర్మాసనం కోరింది.తెలంగాణ రాష్ట్రంలో పిల్ల‌ల‌కు ఇంకా వ్యాక్సిన్ వేయ‌లేదు. ఒక వేళ కోవిడ్ సోకితే పిల్ల‌ల‌కు చికిత్స అందించేందుకు త‌గిన సౌక‌ర్యాలు ఆస్ప‌త్రుల్లో లేవు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభిస్తే, ప్ర‌మాదం జ‌రుగుతుంద‌ని పిటిష‌న‌ర్ త‌రపు న్యాయవాది ఎల్ రవిచందర్ వాదించాడు. ఫిబ్రవరి 1 నుండి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని మీడియాలో కథనాలు వచ్చాయని, ఈ చర్య పిల్లలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్య‌క్తం చేశాడు. పిల్లలకు ఇంకా కోవిడ్-19 టీకాలు వేయని దశలో పిల్లలకు చికిత్స చేయడానికి నీలోఫర్ హాస్పిటల్‌లో ఒక నిర్దేశిత సదుపాయం మాత్రమే ఉంద‌నే విష‌యాన్ని ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లాడు.

ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వ‌హించ‌బోతున్నారు. దీంతో విచ్చలవిడిగా ఓమిక్రాన్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంది. అరికట్టేందుకు తీసుకున్న చర్యలను తెలియ‌చేయాల‌ని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.ఐదు రాష్ట్రాల నుండి దాదాపు 75 లక్షల నుండి 1 కోటి మంది భక్తులు జాతర కు హాజ‌రు అయ్యే అవ‌కాశం ఉంది. ఇటీవల గంగా తీరంలో జరిగిన కుంభమేళా సందర్భంగా జరిగిన ప్రాణనష్టాన్ని చూశాం. ఆ దృష్ట్యా జాతరకు వచ్చే సందర్శకులకు ప్రాణాపాయం క‌లుగ‌కుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాదులు సూచించారు.వీక్లీ బజార్‌లలో భారీ జనసమూహాల కారణంగా, ఓమిక్రాన్ వ్యాప్తి చెందడం వల్ల ప్రజలపై భారీ నష్టం వాటిల్లుతుందని, అటువంటి బజార్ల ఏర్పాటును తగ్గించేలా ఆదేశాలు జారీ చేయాలని వాదించారు. దీనిపై మ‌రిన్ని వాద‌న‌లు వినిపించ‌డానికి అవ‌కాశం ఇస్తూ ఫిబ్ర‌వ‌రి మూడో తేదీకి విచార‌ణ‌ను వాయిదా వేసింది. మొత్తం మీద తెలంగాణ‌లో విచ్చ‌ల‌విడిగా పెరిగిపోయిన క‌రోనా కేసుల కార‌ణంగా ప్ర‌జా ఆరోగ్యం ప్ర‌మాదంలో ప‌డింది. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం, స‌మ్మ‌క్క‌-సార‌క్క జాత‌ర వెర‌సి క‌రోనా తాండ‌విస్తుంద‌ని పిటిష‌న‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు. పైగా కాలేజీలు, యూనివ‌ర్సిటీల‌ను మూసివేసిన కేసీఆర్ స‌ర్కార్ స్కూల్స్ ను ప్రారంభించ‌డంలోని లాజిక్ ఏంటో అర్థం కావ‌డంలేదు.