Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని ప్రతిపక్ష నాయకులు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి పంజాగుట్ట పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. ప్రణీత్ పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశాడని.. అనంతరం ఆయా కాల్ రికార్డ్స్, ఐఎంఈఐ నంబర్లు, ఐపీ అడ్రస్‌లను వ్యక్తిగత పరికరాల్లోకి కాపీ చేసుకుని ధ్వంసం చేశాడని గుర్తించారు. కాపీ చేసుకున్న డిజిటల్ పరికరాలను ఎక్కడ ఉంచాడనే అంశంపై పోలీసులు అతణ్ని ప్రశ్నించారు. దీనికి ప్రణీత్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి బృందం ప్రణీత్‌రావు వద్ద పనిచేసిన ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు అందరి వాంగ్మూలాలు నమోదు చేశారు. వారు చెప్పిన అంశాలకు అనుగుణంగా ప్రణీత్ నుంచి మరికొన్ని విషయాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇటీవల నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రణీత్ వారం రోజులు (ఈ నెల 23 వరకు) పంజాగుట్ట పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. ఏడు రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు ప్రణీత్ రావును ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) ఆధారాల ధ్వంసం విషయంపై పోలీసులు ప్రశ్నించారు. ఇందులో ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇక వారం రోజుల విచారణ పూర్తయ్యే ఇంకెన్ని నిజాలు బయటికి వస్తాయో వేచిచూడాలి.
Also Read :RS Praveen Kumar : నేడు బీఆర్‌ఎస్‌లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రణీత్‌రావు కస్టడీలో ఉండగానే ఎస్‌ఐబీలోని కార్యాలయానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించే ఛాన్స్ ఉంది. అతడికి కేటాయించిన కంప్యూటర్లను పరిశీలించనున్నారు. ఆధారాలు ధ్వంసం చేసిన రోజు సీసీ టీవీ కెమెరాలు ఆఫ్ చేశారని అధికారులు గుర్తించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎలక్ట్రీషియన్‌ను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకున్న సమయంలో మీడియా కంటపడకుండా అతన్ని రహస్య ప్రదేశానికి పోలీసులు తరలించారు. ప్రణీత్ కస్టడీ విచారణను డీసీపీ విజయ్‌కుమార్, సీపీ కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు.