Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో హవాలా డబ్బు పంపిణీ దిశగా కేసు మళ్లుతోంది. దీనిలో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న కొందరు రాజకీయ ప్రముఖులకు త్వరలోనే పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు అందుకోనున్న వారిలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులతో పాటు పలువురు హవాలా వ్యాపారుల ఫోన్లపైనా ఆనాటి ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ టీమ్ నిఘా పెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. విపక్ష పార్టీల నేతలు, వారి సహచరులు, మద్దతుదారుల ఫోన్లపై నిఘా పెట్టి వారు తరలిస్తున్న డబ్బును పట్టుకున్నట్లు సమాచారం. ప్రణీత్ రావు నుంచి అందే ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పని చేసిన రాధాకిషన్ రావు(Phone Tapping Case) ఎన్నికల వేళ పంపిణీ అవుతున్న హవాలా డబ్బును పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join
గత అసెంబ్లీ ఎన్నికల టైంలో రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థులకు డబ్బుల పంపిణీలో మరొక పోలీసు అధికారి కీలక పాత్ర పోషించారని విచారణలో గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏకంగా పోలీసు వాహనాల్లోనే రాష్ట్రమంతా నిధులు రవాణా చేసినట్లు వెల్లడైంది. ఈవిధంగా పోలీసు వాహనాల్లో ఏయే లీడర్ల వద్దకు డబ్బులను చేరవేశారనే సమాచారాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా డబ్బులు అందుకున్న రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి త్వరలోనే విచారించే అవకాశం ఉంది. ఇందులో కొందరు మాజీ మంత్రులు కూడా ఉన్నారట. న్యాయపరమైన అంశాలపై చర్చలు జరుపుతున్న దర్యాప్తు అధికారులు, నిందితుల వాంగ్మూలం ఆధారంగా అనుమానితులను విచారించేందుకు ఉన్న మార్గాలపై కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే.. రెండు, మూడు రోజుల్లోనే ఆ బడా నేతలకు నోటీసులను జారీ చేసే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.
Also Read : Lok Sabha Seats : ఆ నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన నేడే.. లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జీలు వీరే
మరోవైపు హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ చేసి, ఆ సమాచారం ఆధారంగా తనను బెదిరించారంటూ ఓ వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఒక నిందితుడు తన ఫోన్ వాయిస్ రికార్డులను చూపించి మరీ బెదిరించాడని సదరు వ్యాపారి పోలీసులకు చెప్పాడట. పొరుగు రాష్ట్రంలోని తన స్నేహితుడితో మాట్లాడిన వాయిస్ రికార్డులు, నిందితుడికి ఎలా వెళ్లాయో ఎంక్వైరీ చేయాలని కోరాడట.