Phone Tapping Case : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు వేగంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు కీలకంగా మారారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసుల కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 23 వరకు (వారం రోజులు) ఆయనను పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే రెండు రోజుల విచారణ పూర్తయింది. రెండో రోజైన సోమవారం ప్రణీత్ రావు కీలక విషయాలను పోలీసులకు తెలిపారు. ఎస్‌ఐబీ ఆఫీసులోని ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన 42 హార్డ్ డిస్కులను కట్టర్లతో కత్తిరించి వికారాబాద్ అడవిలో పడేశానని ప్రణీత్(Phone Tapping Case) చెప్పారు.దీంతో ఇవాళ ప్రణీత్‌ను వికారాబాద్ అడవులకు తీసుకెళ్లి హార్డ్ డిస్కులకు సంబంధించిన శకలాలను వెతికి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించనున్నారు. ఇదిలా ఉండగా ప్రణీత్‌తో కలిసి ఎస్ఐబీలో పనిచేసి, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా ఉన్న మరో అధికారిని పోలీసులు సోమవారం విచారణకు పిలిపించినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రణీత్‌తో కలిసి ఆ సీఐ పని చేసినట్లు గుర్తించారు. ఎన్నికలు ముగిశాక మళ్లీ నల్గొండలోని ఓ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. విచారణ అనంతరం సదరు సీఐని పంపించేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
కస్టడీలోకి తీసుకున్న ప్రవీణ్ రావును మొదటి రోజు ఒక రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. సోమవారం రోజున బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గేట్లు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించలేదు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులను మాత్రమే లోనికి పంపారు. ఐదేళ్లపాటు ఎస్ఐబీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రణీత్ రావుకు నిఘా సమాచారం ఎంత కీలకమైందో తెలియంది కాదు. అంతటి ప్రాధాన్య సమాచారం చెరిపేశాడని, ధ్వంసం చేశాడన్నది ఆయనపై అభియోగం. అసలు సమాచారాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రత్యేకంగా కొన్ని హార్డ్ డిస్కులనే ఎందుకు ధ్వంసం చేశారని అడిగినట్లు సమాచారం.
Also Read :Japan Jakkanna : జపాన్ బామ్మ ప్రేమకు జక్కన్న ఎమోషనల్
విచారణ కోసం ప్రత్యేక టీమ్
ప్రణీత్ వ్యవహారంలో కేసు నమోదు చేసింది పంజాగుట్ట పోలీసులే అయినా విచారణ కోసం ఇతర అధికారులను రంగంలోకి దింపారు. ముఖ్యంగా నిఘా విభాగంలో అనుభవం ఉండి, ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితోపాటు మరో ఇద్దరితో కలిపి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ప్రణీత్ విచారణ అంతా వారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది.