Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని విపక్ష నేతలు, ప్రముఖ వ్యాపారులు, మీడియా ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయించిన వ్యవహారంపై దర్యాప్తు ముందుకుసాగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన దేశానికి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తెలంగాణ సీఐడీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అమెరికాలోనే ఉన్నట్టుగా భావిస్తున్న ఏ6 నిందితుడు శ్రవణ్ రావుపై కూడా త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయాన్ని సీబీఐకి తెలంగాణ సీఐడీ అధికారులు తెలిపారు. సీబీఐ నుంచి ఇంటర్ పోల్‌కి దీనిపై సమాచారాన్ని చేరవేశారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు సీఐడీ ఈ ప్రయత్నాలు చేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఇప్పటికే ప్రభాకర్ రావుపై(Phone Tapping Case) నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఆయనను తమ ఎదుట హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యం బాగా లేనందున ఇండియాలో విచారణకు హాజరు కాలేనని, మెయిల్ లేదా వర్చువల్ విధానం ద్వారా సిట్ విచారణకు సహకరిస్తానని ప్రభాకర్ రావు అంటున్నారు. గతంలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. బ్లూ కార్నర్ నోటీసు ద్వారా ఆయా దేశాలలో ఉన్న నిందితుల గుర్తింపు లేదా వారి కార్యకలాపాల గురించి సమాచారం కోరవచ్చు. రెడ్ కార్నర్ నోటీసు ద్వారా పారిపోయిన వ్యక్తి ఆచూకీ, తాత్కాలిక(ప్రొవిజనల్) అరెస్టు కోరవచ్చు. అనంతరం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి భారత్‌కు పంపమని రిక్వెస్టు చేయొచ్చు.
Also Read :Israel Vs Yemen: యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. ముగ్గురి మృతి, 80 మందికి గాయాలు
మొత్తం మీద ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు , శ్రవణ్ రావులను అమెరికా నుంచి ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రవణ్‌రావు ఆచూకీని ఇప్పటివరకు దర్యాప్తు బృందం కనిపెట్టలేకపోయింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావే సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. తేల్చారు. ప్రభాకర్ రావు(Prabhakar Rao) ఆదేశాలు ఇచ్చిన తర్వాతే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు గుర్తించారు.