Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో తెలంగాణ హైకోర్టులో పనిచేసిన 18 మంది జడ్జీల వివరాలు ఫోన్ ట్యాపింగ్ కేసు మూడో నిందితుడు భుజంగరావు కంప్యూటర్‌లో లభించాయి. వారిలో ఐదుగురు మహిళా న్యాయమూర్తుల వివరాలు కూడా ఉన్నాయి. భుజంగరావు కంప్యూటర్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) విశ్లేషించి ఈవిషయాన్ని వెల్లడించింది. ఆ కంప్యూటర్‌లో పలు పార్టీల నియోజకవర్గ స్థాయి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఈ మధ్య పదవీ విరమణ చేసిన ముగ్గురు న్యాయమూర్తుల ప్రొఫైళ్లు ఉన్నాయని తేలింది. పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జడ్జీ సమాచారం కూడా ఉందని గుర్తించారు. తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర హైకోర్టులకు బదిలీ అయిన ముగ్గురు జడ్జీల వివరాలు సైతం ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పాటైన నాంపల్లి ఏసీబీ కోర్టుల్లోని(Phone Tapping Case) ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ ఉంది.
Also Read :Indias AI : మేడిన్ ఇండియా ‘ఏఐ’ వస్తోంది.. రంగంలోకి బడా కంపెనీలు
ప్రొఫైళ్లలో ఏమున్నాయి అంటే..?
ఈ ప్రొఫైళ్లలో వారి ఫొటోలు, పుట్టుపూర్వోత్తరాలు, విద్యాభ్యాసం, ఉద్యోగప్రస్థానం, కుటుంబసభ్యుల వివరాలు వంటివి ఉన్నాయి. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలోని ఒక్కో విషయం ఒక్కో రోజు బయటికి వస్తోంది. మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో పలువురు ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు వీరందరి ఫోన్లను ట్యాప్ చేయించారు.
Also Read :Telangana Assembly : ఫిబ్రవరి 7న శాసనసభ ప్రత్యేక సమావేశం..!
ప్రకటిత నేరస్థులుగా ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని కీలక నిందితులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరు అమెరికాలో ఉంటున్నారు. వీరిద్దరిని ప్రొక్లెయిమ్డ్ అఫెండర్లు (ప్రకటిత నేరస్థులు)గా నిర్ధారించాలని భావిస్తున్నారు. దీనిపై తెలంగాణ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. పోలీసులది సరైన చర్యగా న్యాయస్థానం భావిస్తే తొలుత ఒక ఉత్తర్వు జారీ చేస్తుంది. దాని ప్రతులను నిందితుడి ఇల్లు ఉన్న ఏరియాతో పాటు బహిరంగ ప్రదేశాల్లో అతికిస్తారు. దినపత్రికల్లో కూడా యాడ్స్ ఇస్తారు. ఈ ఉత్తర్వు వెలువడిన 30 రోజుల్లోగా కోర్టు ఎదుట నిందితుడు హాజరు కావాలి. లేదంటే అతడిని ప్రొక్లెయిమ్డ్ అఫెండర్‌గా న్యాయస్థానం ప్రకటిస్తుంది. అలాంటి వారిని సాధారణ పౌరులెవరైనా పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించొచ్చు. ఆ తరహా నిందితుల ఆస్తులను పోలీసులు జప్తు చేస్తారు.