Site icon HashtagU Telugu

Sravan Rao at SIT : ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం.. ‘సిట్‌’ ఎదుటకు శ్రవణ్‌ రావు.. వాట్స్ నెక్ట్స్ ?

Phone Tapping Case Sravan Rao At Sit Telangana Sit Brs Govt Kcr Ktr

Sravan Rao at SIT : బీఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణలోని విపక్ష పార్టీల నేతలు లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగింది. రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్‌ను ఆటబొమ్మలా మార్చుకొని.. విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయించారు. వాళ్ల కాల్స్‌ను అక్రమంగా విన్నారు. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈమేరకు అభియోగాలతో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగిన ఏ6 నిందితుడు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఎట్టకేలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషనులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన పాత్ర ఏమిటి ? ఇతర కీలక సూత్రధారులు ఎవరు ?  అనేది తెలుసుకునే దిశగా శ్రవణ్ రావును సిట్ అధికారుల టీమ్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇవాళ శ్రవణ్ ఇవ్వనున్న  స్టేట్ మెంట్ (వాంగ్మూలం) ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకు సాగనుంది. కీలక మలుపు తిరగనుంది. శ్రవణ్ రావు ఏయే అంశాలు రివీల్ చేయబోతున్నారు? ఎవరెవరి పేర్లు బయట పెట్టబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read :Ghibli Trends : జిబ్లీ ట్రెండ్స్‌లోకి మోడీ, చంద్రబాబు, లోకేశ్.. ఏమిటిది ?

2023 ఎన్నికల సమయంలో శ్రవణ్ కీలక పాత్ర

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడపడంలో  శ్రవణ్ రావు కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు అంటున్నారు.  ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, వారికి ఆర్థికంగా అండగా ఉన్న వ్యాపారులపై ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా ఉంచడంలో శ్రవణ్ రావు ముఖ్య భూమిక పోషించారని అంటున్నారు.  ఈ అంశాలపై ఇవాళ శ్రవణ్‌ను ప్రశ్నిస్తారని తెలిసింది.  శ్రవణ్ రావు(Sravan Rao at SIT) సూచన మేరకే ఈ కేసులోని కీలక నిందితులైన ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనే అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో ఎంతమేరకు వాస్తవికత ఉందనేది కూడా సిట్ దర్యాప్తులో తేలనుంది.

Also Read :Double Kick : ఒక బీర్ కొంటే మరొకటి ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

సుప్రీంకోర్టు సానుకూలత.. సిట్ నోటీసులు 

2024 మార్చి 10న హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషనులో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఆ వెంటనే శ్రవణ్ రావు దేశం విడిచి వెళ్లిపోయారు. తొలుత లండన్‌కు వెళ్లారు.  అక్కడి నుంచి అమెరికా‌కు వెళ్లారు. ఈ క్రమంలో భారత సుప్రీంకోర్టును శ్రవణ్‌రావు ఆశ్రయించారు. తనను ముందస్తుగా అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శ్రవణ్ విన్నపాన్ని సానుకూలంగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. భారతదేశానికి వచ్చి తెలంగాణ సిట్ విచారణకు సహకరించాలని సూచించింది.  విచారణకు రావాలంటూ మార్చి 26న శ్రవణ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.  ఈ నెల 29న విచారణకు హాజరుకావాలని కోరింది. దీంతో శ్రవణ్ ఇవాళ విచారణకు హాజరయ్యారు.