Phone Tapping: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకూ కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు కేసు దర్యాప్తులో కీలకంగా భావించే అధికారుల స్టేట్మెంట్లు సిట్ అధికారులు నమోదు చేయడం గమనార్హం.
తాజాగా, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి, జిఏడి (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్లను సిట్ నమోదు చేసింది. వీరిద్దరూ రివ్యూ కమిటీ సభ్యులుగా గత ప్రభుత్వ హయాంలో పనిచేశారు. రివ్యూ కమిటీ చైర్మన్ హోదాలో శాంతికుమారి 2023 నవంబరులో 618 ఫోన్ నెంబర్ల లిస్ట్‌ను టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT)కు పంపించినట్లు సమాచారం. ఈ లిస్టును SIB చీఫ్ ప్రభాకర్ రావు అందించారని తెలుస్తోంది.
దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటికే ఐపీఎస్ అధికారులు జితేందర్, అనిల్ కుమార్ ల స్టేట్మెంట్లు కూడా నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే, ప్రతి రెండు నెలలకోసారి ప్రభాకర్ రావు రివ్యూ కమిటీకి కొత్త ఫోన్ నెంబర్లను అందజేసే పద్ధతిలో వ్యవహరించారని తెలుస్తోంది. వాటిలో అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు సమాచారం.
గత సాధారణ ఎన్నికల సమయంలో ఈ కమిటీ చాలా పెద్ద లిస్టును ఆమోదించిందని, 2023 నవంబరులో పంపిన 618 ఫోన్ నెంబర్ల వ్యవహారంపై సిట్ అధికారులు ప్రాధాన్యతతో స్టేట్మెంట్లు నమోదు చేస్తున్నారు.
ఈ స్టేట్మెంట్లు విచారణలో కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ వర్గాల ప్రమేయంపై స్పష్టత తీసుకురావచ్చని భావిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులతోపాటు కీలక అధికారులు కూడా ఈ వ్యవహారానికి ఎలా సంబంధించినారన్నదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Nara Lokesh : ఇంకొల్లులో డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్