Teenmaar Mallanna: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేశారు. మల్లన్నను విచారణకు హాజరు కావాలని స్పష్టంగా పేర్కొన్న సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అధికారులు, జూలై 17వ తేదీ ఉదయం జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులను విచారించిన సిట్, మరిన్ని కీలకమైన ఆధారాలను సేకరించేందుకు దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా, ఈ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును మంగళవారం విచారణకు హాజరు చేయించుకున్నారు. ఈ విచారణ ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకూ దాదాపు 8.30 గంటల పాటు సాగింది. ఈ విచారణలో ఆయనకు కీలకమైన అనేక ప్రశ్నలు సంధించిన సిట్ అధికారులు, కొన్ని కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం.
Read Also: Minister Komatireddy : దసరా నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి
ప్రభాకర్ రావు పై ఆరోపణల ప్రకారం, ఆయన ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించబడినట్లు పలువురు విచారణకు హాజరైన అధికారులు సిట్ ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభాకర్ రావుతో సాగించిన ఈ సుదీర్ఘ విచారణలో పలు కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసు వెలుగులోకి వచ్చిన అనంతరం ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో ఆయన్ని తిరిగి భారత్‌కు రప్పించేందుకు సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్న సిట్, ఇటీవల ఆయనను తిరిగి విచారణకు హాజరయ్యేలా చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపింది. నిబంధనలు అతిక్రమించి ప్రజల సంభాషణలను గూఢంగా ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో అధికారులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల చర్చలు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించి, విచారణను వేగవంతం చేసింది.
తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేయడమే కాక, ఆయన నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేయనున్నారు. మల్లన్న ఈ వ్యవహారంలో ఎంతవరకు సంబంధముందో అనేది విచారణలో తేలనుంది. మరోవైపు, ఇప్పటికే సిట్ విచారణ ఎదుర్కొన్న అధికారులు తమపై ఉన్న ఒత్తిడితోనే ట్యాపింగ్ జరిగిందని చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకూ సేకరించిన ఆధారాలను సమీక్షిస్తున్న సిట్, మరిన్ని సంబంధిత వ్యక్తులను విచారణకు పిలవనుంది. కేసు పరిపక్వ దశలోకి వెళ్లినందున, త్వరలో కీలకమైన మలుపులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య రాజకీయ దుమారం కొనసాగుతున్న తరుణంలో, ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత దూకుడును సంతరించుకునేలా కనిపిస్తోంది.
Read Also: Kodangal to VKD Train : కొడంగల్ మీదుగా రైల్వే లైను .. తగ్గనున్న గోవా దూరం