Site icon HashtagU Telugu

High Court : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..హైకోర్టులో డీఎస్పీ ప్రణీత్‌రావుకు చుక్కెదురు

222

Phone tapping case..Praneeth Rao will be tried in the High Court

 

హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం(Phone tapping case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (SIB) డీఎస్పీ ప్రణీత్‌రావుకు (DSP Praneeth Rao) హైకోర్టు(High Court)లో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ జీ రాధారాణి తీర్పు వెలువరించారు. కాగా, ప్రణీత్‌రావు పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగియగా, తీర్పును నేటికి రిజర్వు చేసిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

అంతకుముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదన వినిపిస్తూ.. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్‌ను పోలీస్‌ కస్టీకి అప్పగించిందని తెలిపారు. కస్టడీకి సంబంధించిన నిబంధనలను పోలీసులు పాటించడం లేదని, కార్యాలయ పనివేళల్లో కాకుండా ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ప్రణీత్‌ను విచారిస్తున్నారని, విరామం లేకుండా 12 గంటలపాటు విచారణ జరపడం చట్ట వ్యతిరేకమని వివరించారు.

read also: PM Modi: మా దేశాల్లో పర్యటించండి…మోడీకి పుతిన్‌, జెలెన్‌స్కీ ఆహ్వానం

ఈ విచారణకు ప్రణీత్‌ బంధువులను, న్యాయవాదిని అనుమతించడం లేదని, దర్యాప్తునకు సంబంధించిన అంశాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్‌ చేసి ప్రణీత్‌ పరువుకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. పోలీసుల కస్టడీ, దర్యాప్తు నిర్ధిష్ట ప్రదేశంలో జరిగేలా చూడాలని, ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డీ రమేశ్‌ పాల్గొనకుండా కట్టడి చేయాలని కోరారు. అనంతరం పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. ప్రణీత్‌రావుపై దర్యాప్తు చట్ట ప్రకారమే జరగుతున్నదని, విచారణ సమయంలో పోలీసులు ఆయన న్యాయవాదులను అనుమతిస్తున్నారని తెలిపారు. ప్రణీత్‌ తన న్యాయవాది ఫోన్‌ నుంచే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడని చెప్పారు. పిటిషనర్‌ నుంచి కీలక విషయాలను రాబట్టాల్సి ఉన్నందున పోలీస్‌ కస్టడీ యథావిధిగా కొనసాగించాలని కోరారు.