Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తిరిగి భారత్‌కు రానున్నట్లు కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ నెల 5వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరుకానున్నారు. అమెరికాలో ఉంటున్న ఆయన స్వయంగా ఈ విషయాన్ని కేసు దర్యాప్తు బృందానికి ముందస్తుగా తెలియజేశారు. అంతేకాకుండా, సుప్రీంకోర్టుకు మెయిల్ ద్వారా ఓ అండర్‌టేకింగ్ లెటర్ పంపించి, విచారణ ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఇంతకుముందు ప్రభాకర్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి, తనపై ఉన్న ఆరోపణలు నిరాధారమైనవని, తాను ఆరోగ్య సమస్యలతో అమెరికా వెళ్లినట్టు తెలిపారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, హైకోర్టు మే 2న ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రభాకర్ రావు మే 9న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వాదనలు విన్న సుప్రీంకోర్టు, ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. అలాగే ఆయనకు వీలైనంత త్వరగా పాస్‌పోర్ట్ మంజూరు చేయాలని స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ అందిన మూడురోజుల్లోనే ఆయన భారత్‌కు రావాలని, విచారణకు పూర్తిగా సహకరించాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అధికార దుర్వినియోగం, అనధికారికంగా ప్రజల టెలిఫోన్ సంభాషణలు గూఢచర్యం చేయడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రపై విచారణ సాగుతున్న క్రమంలో ఆయన విదేశాలకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఆయన స్వదేశానికి తిరిగి రానున్నట్లు తెలియడంతో కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకోనుందని నిపుణులు భావిస్తున్నారు.
Tragedy : సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రసవానంతరం తల్లి, కొద్ది గంటల్లోనే శిశువు మృతి