Site icon HashtagU Telugu

Excise Minister: ప్రజల ప్రాణాలే ముఖ్యం: ఎక్సైజ్ మంత్రి

Excise Minister

Excise Minister

Excise Minister: ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన బాధ్యత అని తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి (Excise Minister) జూపల్లి కృష్ణారావు అన్నారు. గంజాయి, డ్రగ్స్, నాటుసారా, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆయన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఆదేశించారు. అవసరమైతే ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు కూడా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. శనివారం ఎక్సైజ్ భవన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ STF, DTF, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం, అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ.. బాగా పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలకు ఆయుధాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా పట్టుకున్న నల్ల బెల్లాన్ని సేంద్రియ ఎరువుల తయారీ కోసం రైతులకు ఇవ్వడానికి మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సూచించారు. నాటుసారా తయారీ, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టుకున్న నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను పగలగొట్టకుండా, దానిని జాతీయ ఉత్పత్తిగా గుర్తించి విక్రయించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

Also Read: Haridwar Ardh Kumbh: 2027లో హరిద్వార్‌లో జరిగే అర్ధకుంభ్ తేదీలు ప్ర‌క‌ట‌న‌!

గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ తయారీ, అమ్మకాలు, రవాణా, వినియోగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని మంత్రి కోరారు. నాచారం, చర్లపల్లి వంటి ప్రాంతాల్లోని అక్రమ పరిశ్రమలపై తనిఖీలు చేపట్టాలని కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఒకే లైసెన్స్‌పై ఎక్కువ బార్లు నడుపుతున్నారనే ఆరోపణలపై నిఘా పెట్టాలని, ఫామ్‌హౌస్‌లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బ్రాందీ షాపుల సమయ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖాళీగా ఉన్న రైస్ మిల్లులు, ఇతర ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్ మాట్లాడుతూ.. ఎక్సైజ్ ఆదాయం తగ్గిందని, దానిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్ల వారీగా ఆదాయ అంచనాలు వేస్తున్నామని చెప్పారు. దసరా సందర్భంగా ఎక్సైజ్ విక్రయాలు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్, NDPL, నాటుసారా తయారీ, అమ్మకాలపై కఠినంగా వ్యవహరించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించామని మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పాల్గొన్నారు.