Site icon HashtagU Telugu

Eye Conjunctivitis: కళ్ల కలకతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: హరీశ్ రావు

Harishrao review corona

Harishrao

Eye Conjunctivitis : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కళ్ల కలక కేసులు పెరుగుతున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న రోగులు ఆస్పత్రులకు క్యూ కట్టడంతో ప్రధాన హస్పిటల్స్ రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాల తర్వాత వైరల్ ఫీవర్లు కూడా పెరిగే అవకాశం ఉండటంతో.. రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. కళ్ల కలక ఇన్ఫెక్షన్‌ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానివల్ల ప్రమాదమేమీ లేదని చెప్పారు మంత్రి హరీష్ రావు. కళ్ల కలక చికిత్సలో వినియోగించే చుక్కల మందు, ఆయింట్ మెంట్ లు, అవసరమైన మందులను పీహెచ్‌సీ, బస్తీ దవాఖాన, పల్లె దవాఖానల స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి.. కళ్ల కలక, సీజనల్‌వ్యాధుల అప్రమత్తతపై చర్చించారు.

కళ్ల కలక ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కళ్ల కలక సోకినవారిని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గుర్తించి సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందేలా చూడాలన్నారు మంత్రి హరీష్ రావు. గురుకులాలు, హాస్టళ్లలో పరిశుభ్రత గురించి అవగాహన పెంచాలని చెప్పారు.

ఇన్ఫెక్షన్‌ సోకినవారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వారు వాడిన వస్తువులు ఇతరులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చేయాలన్నారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఓపీ వేళలు పెంచాలని సూపరింటెండెంట్‌ కు సూచించారు మంత్రి హరీష్ రావు. మరోవైపు మంత్రి సత్యవతి గురుకుల పాఠశాలలో కేసులు పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ఏరియా అధికారులతో చర్చించారు. కాగా ఇటీవల మంచిర్యాల జిల్లాలోని ఓ హాస్టల్ లో 400 మంది కండ్ల కలక బారిన పడ్డారు. ఒకరి నుంచి ఒకరికి సోకడంతో రెండ్రోజుల్లో 400 కేసులు వచ్చాయని వైద్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా కండ్ల కలక కేసులు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అధికారికంగా వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. మొత్తంగా రెండు వేల వరకూ కేసులు ఉండొచ్చని తెలుస్తోంది. వారంలో 400 మంది కళ్ల సమస్యతో ఆసుపత్రి వచ్చారని సరోజిని దేవి ఆసుపత్రి సూపరింటెండెంట్ తెల్పడం గమనార్హం.