PCC Chief:రేవంత్ సోలో పాలి’ట్రిక్స్’

రేవంత్ రెడ్డి దూకుడు చూసి ఆయనకి పీసీసీ చీఫ్ పదవి వస్తే బాగుండని చాలామంది అనుకున్నారు. కానీ ఆ దూకుడే ఇప్పుడాయనకి ఇబ్బందిగా మారింది.

రేవంత్ రెడ్డి దూకుడు చూసి ఆయనకి పీసీసీ చీఫ్ పదవి వస్తే బాగుండని చాలామంది అనుకున్నారు. కానీ ఆ దూకుడే ఇప్పుడాయనకి ఇబ్బందిగా మారింది. ఆయన డైనమిక్స్ తో పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తెస్తారని అందరూ భావించారు కానీ ఆ ప్లస్ పాయింటే ఆయనకి మైనస్ పాయింట్ గా మారి రేవంత్ ని ఒంటరి వాడ్ని చేస్తున్నట్లు కన్పిస్తోంది.

రేవంత్ ఎవరితో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాల్లో వన్ మెన్ షో పాత్రను పోషిస్తున్నారని కొందరు సీనియర్లు రేవంత్ కి సహాయ నిరాకరణ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు జీరోగా ఉన్నప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ గా నియామకం అయ్యారు. ఆయన వచ్చాక కాంగ్రెస్ చేపట్టిన దళిత గిరిజన దండోరా సభలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ వచ్చింది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి మళ్ళీ ఊపు తెస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ముందు నుండి పీసీసీ పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన సీనియర్లంతా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టిన రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో గా వ్యవహరిస్తున్నారని వాదిస్తూనే ఉన్నారు.

రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఆయనే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ముందుగా తాను నిర్ణయం తీసుకొని కమిటీలో అప్రూవల్ చేసుకుంటారని సీనియర్లు అసంతృప్తి చెందుతున్నారు.

రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత దళిత దండోరా సభలు , మూడు చింతలపల్లి లో దీక్ష, నిరుద్యోగుల కోసం జంగ్ సైరన్ , విపక్షాలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరుపై తాను నిర్ణయం తీసుకున్నాక కమిటీలో చర్చించి అప్రూవల్ తీసుకున్నారని సమాచారం.

సాధారణంగా ఏ పార్టీలోనైనా ఒక సామజికవర్గ నేతలంతా ఒక్కతాటిపై ఉంటారు. కాంగ్రెస్ లో రేవంత్ సామాజికవర్గ నేతలంతా కీ రోల్స్ లోనే ఉన్నారు. అయినా వారంతా రేవంత్ కి వ్యతిరేకమే. ఉత్తమ్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి లాంటి నేతలెవరూ రేవంత్ కి సపోర్ట్ చేయడం లేదు.

ఇక టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ కి అధిష్టానం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టడం అనంతరం పీసీసీ చీఫ్ గా నియమించడాన్ని పార్టీలోని ముఖ్యనేతలందరూ బయటకి చెప్పకపోయినా అంతర్గతంగా విమర్శించారు. పార్టీలోకి వచ్చిరాగానే పదవి ఇవ్వడం ఏంటని సీనియర్స్ ఎవరూ సహకరించలేదు. దింతో రేవంత్ వన్ మెన్ షో పాత్రని పోషిస్తూ ముందుకు వెళుతున్నారు.

రేవంత్ సోలో పెర్ఫార్మెన్స్ పై సీనియర్లు పలుమార్లు తమ అసంతృప్తి వ్యక్తం చేసినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. దూకుడుగా ఉంటేనే మాస్ జనాలు పార్టీని నమ్ముతారని రేవంత్ అభిప్రాయపడుతున్నాడు.
రేవంత్ వల్ల పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన స్థానంలో వేరేవాళ్లని నియమించాలనే డిమాండ్ కూడా వస్తోంది. ఇక ఈ సమస్యను కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.