Site icon HashtagU Telugu

4th Wave: తెలంగాణ లో మాస్క్ వేసుకోకుంటే రూ.1000 ఫైన్.. ముంచుకొస్తున్న నాలుగో వేవ్ ?

Covid Fourth Wave Imresizer

Covid Fourth Wave Imresizer

కరోనా కేసులు మళ్ళీ దడ పుట్టిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 14,506 కొత్త కేసులు నమోదయ్యాయి. 30 మంది కొవిడ్ తో చనిపోయారు. దాదాపు లక్ష యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో కరోనా నాలుగో వేవ్ మొదలైందా అనే సందేహాలు మిన్నంటాయి. ఈనేపథ్యంలో చాలా రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. మాస్క్ ను తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించని వారిపై రూ.1000 జరిమానా విధిస్తామంటూ తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. అన్ని బహిరంగ ప్రదేశాలు, మెట్రో రైళ్లలోనూ మాస్క్ విధిగా ధరించాలని నిర్దేశించారు.

రాష్ట్రాలకు కేంద్రం లేఖ

మరోవైపు కేంద్ర సర్కారు కూడా అలర్ట్ అయింది.కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లెటర్స్ రాసింది. కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని.. కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
త్వరలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యాత్రలు ప్రారంభం కానున్నాయని, పండుగల సీజన్ వస్తోందని కేంద్రం గుర్తు చేసింది. ఈ సమయంలో ప్రజలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారని, ఎక్కువగా గుమికూడే అవకాశం ఉందని రాష్ట్రాలకు తెలిపింది.

కర్ణాటకలో..

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో బయటపడుతున్న కొత్త కొవిడ్ కేసుల్లో 96 శాతం బెంగళూరులోనే నిర్ధారణ అవుతున్నాయి. ప్రస్తుతం నగరం పరిధిలో కొవిడ్ కట్టడి జోన్లు 33 ఉన్నాయి. ప్రతిరోజూ కర్ణాటక లో దాదాపు 500 నుంచి 700 మందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ఈనేపథ్యంలో కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం బొమ్మై యోచిస్తున్నారు. మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో భారీ జరిమానాలు విధించాలని భావిస్తున్నారు.

Exit mobile version