Pawan Kalyan in TS: తెలంగాణ‌పై ప‌వ‌న్ క‌ద‌లిక‌

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి చిన్నాచిత‌క పార్టీల రోల్ కీల‌కం కానుంది.

  • Written By:
  • Updated On - May 19, 2022 / 02:42 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి చిన్నాచిత‌క పార్టీల రోల్ కీల‌కం కానుంది. ఆ పార్టీలు చీల్చే ఓటు బ్యాంకు స్వ‌ల్పంగా ఉంటుద‌ని ప్ర‌ధాన పార్టీలు లైట్ గా తీసుకుంటున్న‌ప్ప‌టికీ గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యించే స్థాయిలో ఉంటాయ‌ని కొంద‌రు భావిస్తున్నారు. కేవ‌లం ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌రిపాల‌న మీద ఒంటికాలుమీద లేస్తోన్న ప‌వ‌న్ తాజాగా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం అయ్యారు. రైతు ప‌రామ‌ర్శ యాత్ర ద్వారా ఏపీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల వ‌ద్ద‌కు వెళుతోన్న ఆయ‌న ల‌క్ష వ‌ర‌కు ఆర్థిక స‌హాయం అందిస్తున్నారు. విడ‌త‌ల‌వారీగా ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతోన్న ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబాల వ‌ద్దకు వెళ్లడం ద్వారా రాజ‌కీయ ల‌బ్ది పొంద‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీల మాదిరిగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాల వ‌ద్ద‌కు వెళుతున్నారు. గ‌తంలో జ‌గ‌న్ చేసిన ఓదార్పు త‌ర‌హాలోనే రైతు కుటుంబాల పరామ‌ర్శ యాత్ర‌ను డిజైన్ చేసుకున్నారు.

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 20న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించడానికి సిద్ధం అయ్యారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించన్నారు. ఉమ్మడి నల్లొండ జిల్లా చౌటుప్పల్, కోదాడలో పవన్ కల్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు మొదలైనట్టు జ‌న‌సేన ప్ర‌క‌ట‌న చేసింది. రోడ్డు ప్ర‌మాదంలో చనిపోయిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందించ‌నున్నారు. ఈనెల 20వ తేదీన పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో బయల్దేరి.. మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం చేరుకుంటారు. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి కోదాడకు వెళ్లి, కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పవన్ పరామర్శిస్తారని ఒక ప్రకటనలో జ‌న‌సేన పేర్కొంది. మొత్తం మీద ఏపీలోనే కాదు, తెలంగాణ‌లోనూ జ‌న‌సేన ఉంద‌ని సంకేతం ఇవ్వ‌డానికి ఒక ప్రొగ్రామ్ ను ప‌వ‌న్ డిజైన్ చేసుకున్నారు.

ఇప్ప‌టికే తెలంగాణ జ‌న స‌మితి పార్టీ తెలంగాణ‌లో ప‌నిచేస్తోంది. ఆ పార్టీ చీఫ్ కోదండ‌రామిరెడ్డి బంగారు తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో జ‌రుగుతోన్న త‌ప్పుల‌ను అప్పుడ‌ప్పుడు ఎత్తిచూపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ పార్టీ ఉందో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితిలో ఉంది. తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన ష‌ర్మిల పాద‌యాత్ర‌ను చేస్తున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల పరామ‌ర్శ‌ల‌తో పాటు, నిరుద్యోగ స‌మ‌స్య‌పై గ‌ళం మెత్తారు. ఆమె పాద‌యాత్ర‌కు వ‌స్తోన్న స్పంద‌న అంతంత‌మాత్ర‌మే. ఆ పార్టీ లక్ష్యం తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యాన్ని ఏర్పాటు చేయ‌డం. మ‌రో పార్టీ యువ తెలంగాణ పార్టీని జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేసిన రాణిరుద్రమ, జిట్టా బాల‌క్రిష్ణారెడ్డి కొంత కాలం న‌డిపారు. ఇటీవ‌ల రాణిరుద్ర‌మ బీజేపీ గూటికి చేరారు. దీంతో యువ తెలంగాణ ఉందా? లేదా? అనేది సందిగ్ధం. జై స్వ‌రాజ్ పార్టీ మ‌రో జ‌ర్న‌లిస్ట్ కాసాని శ్రీనివాసారావు న‌డుపుతున్నారు. ఆయ‌న కూడా ఇటీవ‌ల తిరుప‌తి వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు. ఉద్య‌మ‌కారుడు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్ మ‌న ఇంటి పార్టీని న‌డుపుతున్నారు. ఆ పార్టీ ఉనికి ఎక్క‌డో ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌దు. తాజాగా బీఎస్పీ పార్టీ తెలంగాణ కన్వీన‌ర్ హోదాలో డాక్ట‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్వారోల ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళుతున్నారు. బ‌హుజ‌న రాజ్యాధికారం ఆయ‌న ల‌క్ష్యం. మ‌రో కొత్త పార్టీ చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మ‌ల్ల‌న స్థాపింనున్నారు. ఆ మేర‌కు ఆయ‌న ఇటీవ‌ల ఒక ప్ర‌క‌ట‌న చేయ‌డం ద్వారా 7200 ఉద్య‌మాన్ని తీసుకు రావ‌డానికి సిద్ధం అయ్యారు. ఇలా ప‌లు చిన్నాచిత‌క పార్టీలతో తెలంగాణ రాజ‌కీయం ముడిప‌డింది. వీటితో పాటు ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు ఉన్నారు. ఇప్పుడు జ‌న‌సేన తెలంగాణ వేదిక‌పైన క‌నిపించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌డానికి జ‌నసేన‌తో స‌హా చిన్నాచిత‌క పార్టీలు ప‌నికొస్తాయ‌ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భావించ‌డంలేదు. చిన్న పార్టీల ఉనికి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద‌గా ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. కానీ, ఇప్పుడు
ప‌వ‌న్ కూడా రంగంలోకి దిగ‌డంతో ప్ర‌ధాన పార్టీల చూపు చిన్నాచిత‌క పార్టీల‌పై ప‌డింది. ఆ పార్టీల‌ను ఒక గొడుగు కింద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం రాబోవు రోజుల్లో ఏపీ త‌ర‌హాలో ప‌వ‌న్ పిలుపునిస్తారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది.