Pawan Kalyan New Party : ‘బీమ్లా’తో కేసీఆర్ కొత్త‌ పార్టీ?

ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నాడా? టీఆర్ ఎస్ పార్టీని తెలుగు రాష్ట్ర స‌మితిగా మార్చ‌బోతున్నాడా?

  • Written By:
  • Publish Date - February 26, 2022 / 02:39 PM IST

ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నాడా? టీఆర్ ఎస్ పార్టీని తెలుగు రాష్ట్ర స‌మితిగా మార్చ‌బోతున్నాడా? భీమ‌వ‌రం నుంచి కేటీఆర్ ఈసారి నామినేష‌న్ వేస్తాడా? ప్ర‌త్యేక హోదా డిమాండ్ ను కేసీఆర్ అందుకోబోతున్నాడా? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు బీమ్లా నాయ‌క్ విడుద‌ల సంద‌ర్భంగా ఏపీలో వెలిసిన ఫ్లెక్సీలు కొంత మేర‌కు స‌మాధానం ఇస్తున్నాయి. ప‌వ‌న్ అభిమానులు ఏపీ అంత‌టా కేసీఆర్ ఫ్లెక్సీల‌ను పెట్టారు. బెనిఫిట్ షోలు, ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అవ‌కాశం ఇచ్చిన తెలంగాణ సీఎంకు ఏపీలో అభినంద‌న‌లు చెబుతూ క‌టౌట్ లు పెట్టారు. ఇదంతా సినిమా గోల అనుకోవ‌చ్చు. కానీ, రాజ‌కీయ కోణం నుంచి చూస్తే కేసీఆర్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. ఇటీవ‌ల ఫెడ‌ర‌ల్ అంటూ దూకుడుగా ఉన్న తెలంగాణ సీఎం రాబోవు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని విస్త‌రించ‌డానికి అవ‌కాశాలు లేక‌పోలేద‌నే సంకేతాలు త‌ర‌చూ ఇస్తూనే ఉన్నాడు.తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీలో ఫాలోయింగ్ బాగా ఉంది. అమ‌రావ‌తి శంక‌స్థాప‌న రోజు ఆయ‌న ప్ర‌సంగానికి వ‌చ్చిన స్పంద‌న చూశాం. విశాఖ శార‌ద పీఠంలో పూజ‌ల కోసం వెళ్లిన‌ కేసీఆర్ ను అక్క‌డి ప్ర‌జ‌లు సాద‌రంగా ఆహ్వానించారు. రోడ్ల‌కు ఇరువైపులా నిల్చుని ఆనాడు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. తిరుప‌తి ద‌ర్శ‌నం కోసం వెళ్లిన కేసీఆర్ ను ఆహ్వానిస్తూ భారీ క‌టౌట్ లు వెలిసిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ విజ‌యం కోసం విజ‌య‌వాడ‌లోని ఓ వీరాభిమాని నాలుక కోసుకున్న సంఘ‌ట‌న మ‌రువ‌లేం. రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమగా చేస్తానన్న కేసీఆర్ మాట‌లు ఏపీ ప్ర‌జ‌ల చెవుల్లో రింగు మంటునూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర మూలాలున్న కేసీఆర్ సామాజిక‌వ‌ర్గం కూడా ఏపీలో బ‌లంగా ఉంది. ప్ర‌తి సంక్రాంతికి గోదావ‌రి జిల్లాల‌కు క‌ల్వ‌కుంట్ల కుటుంబం రావ‌డం ఆన‌వాయితీ. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగు రాష్ట్ర స‌మితిగా మార్చుతామంటూ కేటీఆర్ వెల్ల‌డించాడు. భీమ‌వ‌రం నుంచి పోటీ చేస్తానంటూ సెటైరిక్ గా అన్నాడు. ప్ర‌త్యేక‌హోదా ఏపీకి అవ‌స‌ర‌మ‌ని ఆనాడు ఎంపీగా ఉన్న క‌విత మ‌ద్ధ‌తు ఇచ్చిన విష‌యం అంద‌రికీ ఎరుకే.

కొత్త పార్టీ పెడ‌తానంటూ ఇటీవ‌ల కేసీఆర్ మీడియాకు సంకేతాలు ఇచ్చాడు. జాతీయ రాజ‌కీయాల వైపు కేసీఆర్ దూకుడు పెంచాడు. ఆ సంద‌ర్భంగా బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల‌కు బ‌దులుగా ఫ్రంట్ అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నాడు. అందుకే, కొత్త పార్టీ పెట్ట‌డానికైన సిద్ధమంటూ కేసీఆర్ వెల్ల‌డించాడు. ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజుల‌కే బీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో మంత్రి కేటీఆర్ క‌నిపించాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. ప‌వ‌న్ అంటే ఎవ‌రో కూడా తెలియ‌ద‌ని సెటైర్ వేసిన కేసీఆర్‌, కేటీఆర్ ఇప్పుడు ప‌వ‌న్ ఫాలోయింగ్ పై ఫిదా అవుతున్నారు. దేశంలోని టాప్ హీరోల కంటే మెరుగైన హీరోగా పవ‌న్ ఉన్నాడ‌ని ఆకాశానికి ఎత్తేశాడు కేటీఆర్‌. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా బీమ్లా నాయ‌క్ సినిమాకు బాహాటంగా బెనిఫిట్ షోలు, ధ‌ర‌ల పెంపుకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఒక్క‌సారిగా తెలంగాణ ప్ర‌భుత్వానికి, క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి ప‌వ‌న్ పైన ప్రేమ పుట్టుకొచ్చింది.ఇంకో వైపు ప‌వ‌న్ అభిమానులు తెలంగాణ సీఎం కేసీఆర్ క‌టౌట్ల‌ను ఏపీలో ఏర్పాటు చేశారు. బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అవ‌కాశం ఇచ్చినందుకు ఉడ‌తాభ‌క్తిని చాటుకున్నారు. భారీ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేసిన కేసీఆర్ కు జై కొట్టారు. విజయవాడలోని థియేటర్ వెలుపల జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపే భారీ కటౌట్‌లను ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.భీమ్‌లా నాయక్‌కు తక్కువ ధరతో పాటు అదనపు షో మరియు బెనిఫిట్ షోలను ప్రభుత్వం అనుమతించినందున అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేస్తున్నారు. కృష్ణ‌లంక‌లోని ఫ్లెక్సీపై ‘హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్’ అంటూ ముఖ్యమంత్రిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతూ కటౌట్ లు ఏపీలో క‌నిపించ‌డం రాజ‌కీయాన్ని సంత‌రించుకున్నాయి.

తెలంగాణ‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఏపీ సీఎం జ‌గ‌న్‌, కేసీఆర్ మ‌ధ్య కొంత గ్యాప్ ఏర్ప‌డింది. ఉద్దేశ‌పూర్వ‌కంగా ష‌ర్మిలతో తెలంగాణాలో పార్టీ పెట్టించాడ‌నే అనుమానాలు లేక‌పోలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వాళ్లిద్ద‌రూ స‌ఖ్య‌త‌గా మాట్లాడుకుంటున్న‌ప్ప‌టికీ రాబోవు రోజుల్లో ద‌ళిత క్రిస్టియ‌న్లు, రెడ్డి సామాజిక వ‌ర్గం, వైఎస్సాఆర్ అభిమానుల ఓట్ల‌ను ఆమె కొల్ల‌గొట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే తొలి విడ‌త పాద‌యాత్ర చేసిన ఆమె మ‌లి విడ‌త‌కు. సిద్ధం అవుతోంది. ఆ సంద‌ర్భంగా కేసీఆర్ స‌ర్కార్ ను టార్గెట్ చేస్తోంది. ప్ర‌తిగా ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీని విస్త‌రింప చేయ‌డానికి కేసీఆర్ వ్యూహాలు ర‌చించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. అందుకు బ‌లం చేకూరేలా ఆయ‌న ఇటీవ‌ల కొత్త పార్టీ పెడ‌తానంటూ సంకేతాలు ఇచ్చాడు. ఒక వేళ ఆయ‌న ఏపీలోకి ఎంట్రీ ఇస్తే, జ‌గ‌న్ కు భారీగా న‌ష్టం జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఎందుకంటే, 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ బాహాటంగా జ‌గ‌న్ కు మ‌ద్ధ‌తు ఇచ్చాడు. కేసీఆర్ సామాజిక‌వ‌ర్గం, అభిమానులు కూడా జ‌గ‌న్ వైపు ఆనాడు మొగ్గారు. ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీ మాత్ర‌మే ప్ర‌ధానంగా ఏపీలో బ‌లంగా ఉన్నాయి. జ‌న‌సేన ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. వామ‌ప‌క్షాలు ప్ర‌స్తుతం టీడీపీ ప‌క్షాన ఉన్నాయి. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోవ‌డానికి ప‌వ‌న్ సిద్ధం అవుతున్నాడ‌ని ఇటీవ‌ల జ‌రిగిన ప‌లు ప‌రిణామాలు చెబుతున్నాయి. ప్ర‌త్యామ్నాయంగా చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర‌గా మెలగ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌న‌డానికి బీమ్లా నాయ‌క్ సినిమాకు టీడీపీ మ‌ద్ధ‌తు ఇవ్వ‌డ‌మే. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తే, జాతీయ ఈక్వేష‌న్స్ ప్ర‌కారం వామ‌ప‌క్షాలు, జ‌న‌సేన‌, కేసీఆర్ కొత్త పార్టీ ఒక‌ట‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు. అదే జ‌రిగితే..కేసీఆర్ హ‌వా, ప‌వ‌న్ క్రేజ్ ఏపీలో రాజ్యాధికారం దిశ‌గా వెళ్లొచ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నా. తెలంగాణ‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి వామ‌ప‌క్షాలు, జ‌న‌సేన తోడుంటే మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి పుష్క‌లంగా అవ‌కాశాలు ఉన్నాయి. ఇలాంటి వ్యూహంతోనే బీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో కేటీఆర్ ప్ర‌సంగం ఉంద‌ని కేసీఆర్ ఎత్తుగ‌డ‌లు తెలిసిన వాళ్లు చెప్పుకుంటోన్న మాట‌. సో..బీమ్లా నాయ‌క్ టాలీవుడ్ రికార్డుల‌నే కాదు, తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చ‌బోతుంద‌న్న‌మాట‌.!