‘Parivar welcomes you Modi Ji’ : ప్రధాని పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధమే కాదు పోస్టర్లు, ఫ్లెక్సీల యుద్ధం జరుగుతోంది.

  • Written By:
  • Updated On - April 8, 2023 / 11:23 AM IST

‘Parivar welcomes you Modi Ji’ :తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధమే కాదు పోస్టర్లు, ఫ్లెక్సీల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు సెటైరికల్ గా పోస్టర్లు ముద్రించి అతికించుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ పోస్టర్లు, ఫ్లెక్సీల వార్ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్, ఈడీ దాడులు వంటి పరిణామాలతో గులాబీ, కాషాయ పార్టీల మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రధానిమోదీ రేపు హైదరాబాద్ లో పర్యటించనుండగా.. ఆయనకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మోదీ పర్యటించనున్న సికింద్రాబాద్ ప్రాంతంలోనే ఈ పోస్టర్లు వెలిసాయి. ఫ్లెక్సీల మీద ఉన్న వాక్యాలు చూస్తే బీజేపీకి వ్యతిరేకంగానే వీటిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలలో ఉన్న వివిధ అంశాలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినట్లుగా స్పష్టంగా సూచిస్తున్నాయి. బీజేపీ అచీవ్‌మెంట్స్ పేరుతో భారతదేశం మ్యాప్ ను గీసి ఆయా రాష్ట్రాలలో దర్యాప్తు సంస్థలు దాడులకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్స్ ఒక ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై దాడులు చేయించడం తప్ప చేస్తున్న గొప్ప పనులేమీ లేవని తెలియజేసే విధంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఇక మరో ఫ్లెక్సీలో పరివార్ వెల్కమ్స్ యూ మోదీజీ అనే పేరుతో బీజేపీలో వారసత్వ రాజకీయాలకు సంబంధించిన నేతల ఫోటోలను వారి పేర్లను ముద్రించి, బీజేపీ వారసత్వ రాజకీయాలను టార్గెట్ చేశారు. ఈ ఫ్లెక్సీలలో తల్లిదండ్రులు లేదా పిల్లలు రాజకీయాల్లో ఉన్న డజన్ల కొద్దీ బీజేపీ నేతల ఫోటోలు ఉన్నాయి.

వీరిలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ , అమిత్ షా, పియూష్ గోయల్ , ధర్మేంద్ర ప్రధాన్, కిరణ్ రిజిజు, జ్యోతిరాధిత్య సింధియా ఉన్నారు. మోదీ ఎప్పుడు విమర్శించినా కేసీఆర్ కుటుంబం , వారసత్వ రాజకీయాలు అంటూ వ్యాఖ్యానిస్తారు కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 8వ తేదీన హైదరబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ 11వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కూడా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.