Hyderabad: ప్రైవేట్ ‘ఫీజు’లుం.. పిల్లల సదువులు సాగేనా!

కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కరోనా టైం లోనూ విద్యాసంస్థలు ఫీజులను వసూలు చేశాయి.

  • Written By:
  • Updated On - February 26, 2022 / 05:01 PM IST

కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కరోనా టైం లోనూ విద్యాసంస్థలు ఫీజులను వసూలు చేశాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఫీజుల బాధలు తప్పినట్టయింది. ప్రస్తుతం అనేక విద్యాసంస్థలు ప్రారంభంకావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల భారం పట్టుకుంది. న్యూ అడ్మిషన్ రూపంలోకానీ, ఇతర రూపంలోకానీ అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారం.. ఒక పాఠశాల అడ్మిషన్ సమయంలో క్యాపిటేషన్ ఫీజుగా విద్యార్థి నుంచి 5,000 కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. అయితే అడ్మిషన్‌ మంజూరు చేసేందుకు సగానికిపై విద్యాసంస్థలు 30,000 నుంచి 1,00,000 వరకు వసూలు చేస్తున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయమై హైదరాబాద్ లోని కాప్రాకు చెందిన ఓ పేరెంట్ రియాక్ట్ అవుతూ ‘‘9వ తరగతిలో నా బిడ్డ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజుగా 30,000 చెల్లించమని నన్ను అడిగారు” చెప్పారు. ట్యూషన్ ఫీజులతో పాటు, 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన యాక్టివిటీ ఫీజు వంటి ఫీజులను పాఠశాలలు మళ్లీ వసూలు చేయడం ప్రారంభించాయని ఆయన ఆరోపించారు. క్యాపిటేషన్/అడ్మిషన్ ఫీజుగా నిర్దేశించిన 5,000 కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులు పాఠశాలలను హెచ్చరించాలని తల్లిదండ్రులు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి కూడా నెలవారీ ప్రాతిపదికన ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసేలా రాష్ట్రంలోని పాఠశాలలను ఆదేశించాలని డిమాండ్ చేశారు.

“మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు ఇప్పటికీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలా మందికి గత రెండేళ్లుగా జీతాలు పెంచకపోవడంతో మరికొందరు వేతనాల్లో కోత పెట్టాల్సి వస్తోంది. ఈ తరుణంలో, పాఠశాలలు మరో విద్యా సంవత్సరానికి నెలవారీగా ఫీజుల వసూలు చేస్తే మరిన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తోంది” అని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకట్ సాయినాథ్ అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పాఠశాలలు ఫీజులు వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (TRSMA) నగరంలోని కొన్ని పేరొందిన పాఠశాలలు మాత్రమే అడ్మిషన్ ఫీజులను వసూలు చేస్తున్నాయని పేర్కొంది. ఫీజుల పెంపు విషయానికి వస్తే.. పెంచకుండా బతకడం కష్టమని వాపోయారు. ఈ ఏడాది ఫీజులు పెంచకుంటే చాలా పాఠశాలలు మూతపడతాయని టీఆర్‌ఎస్‌ఎంఏ అధ్యక్షుడు శేఖర్‌రావు అన్నారు.