Site icon HashtagU Telugu

Pani Puri : పానీపూరీతో తెలంగాణలో టైఫాయిడ్ జ్వరాలు!

Panipuri

Panipuri

పానీ పూరీ తింటున్నారా? అయితే కాసేపు ఆగండి..ఈ వార్త చదవండి. ఇటీవల కాలంలో బయటపడిన పలు టైఫాయిడ్‌ కేసులకు పానీ పూరీ తో లింక్ ఉందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో తోపుడు బండ్లపై విక్రయించే పానీ పూరీ తింటే రోగాల బారినపడే ముప్పు ఉందని హెచ్చరించింది. ఈమేరకు తెలంగాణ ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో పానీ పూరి తయారీదారులు కూడా పరిశుభ్రత పాటించడం ఎంతో కీలకమని సూచించారు. పానీపూరీలో కలిపేందుకు వాడే నీటిని కాచి వడపోయాలన్నారు. తోపుడు బండ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణలో వ్యాపారులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

ప్రజలకు వరుసగా మూడు, నాలుగు రోజులు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించుకోవాలని గడల సూచించారు. బయట తినే పది రూపాయల ఆహారం కారణంగా వేలాది రూపాయలు హాస్పిటల్ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక్క జూలై నెలలోనే తెలంగాణలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు ఈ వ్యాఖ్యలు చేశారు. దోమలు, కలుషిత నీటి కారణంగా రాష్ట్రంలో 6 వేల మంది ప్రజలు వ్యాధుల బారినపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో డెంగ్యూ కేసులు సైతం పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1184 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌ నగరంలోనే 516 డెంగ్యూ కేసులు నమోద య్యాయని శ్రీనివాస రావు తెలిపారు. కొద్దిరోజుల క్రితం నేపాల్‌లోని ఖాట్మండులోనూ ఇదే రకంగా సీజనల్ వ్యాధులకు కారణమవుతోందంటూ నగరంలోని పానీపురి బండ్లపై బ్యాన్ విధించారు.

Exit mobile version