Voter Registration : ఇంకొన్ని నెలల్లో గ్రామ పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఓటరు నమోదు, సవరణలు, అభ్యంతరాలపై దరఖాస్తుల సమర్పణకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్ ఇచ్చింది. నాలుగు రోజుల క్రితమే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు ఈ దరఖాస్తులు చేయొచ్చు. ఈ అప్లికేషన్లను పరిశీలించి జనవరి 6న ముసాయిదా జాబితాను, ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను రిలీజ్ చేస్తారు. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతోపాటు బూత్ స్థాయిల్లోనూ బీఎల్‌వోలు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సవరించుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు తొలగించిన వాటి విషయంలో సమగ్రంగా ఇంటింటి సర్వే చేపట్టి పరిశీలన జరిపించాలని, డూప్లికేషన్‌లు లేకుండా చూడాలన్నారు. 100 సంవత్సరాలు దాటిన ఓటర్ల వివరాలను మరోమారు సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఇంకా ఎక్కడైనా కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంటే ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తమ ఓటు ఉందో.. లేదో..! ఓటరు జాబితాలో చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేనివారు, కొత్త ఓటర్లు విధిగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. ఫిబ్రవరిలో విడుదల చేసే జాబితా నాటికి ఓటర్ల సంఖ్య(Voter Registration) మరింతగా పెరిగే అవకాశం ఉంది.