Site icon HashtagU Telugu

Munugode Congress: ‘ఒక్క ఛాన్స్’ ప్లీజ్ అంటున్న పాల్వాయి స్రవంతి!

Palvai Sravanthi

Palvai Sravanthi

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఒక్క అవకాశం అనే నినాదంతో ముందుకు సాగుతోంది. మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తెగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని, నెలరోజుల ప్రచారంలో తనకు లభించిన ఆదరణ చూసి మురిసిపోయానని స్రవంతి చెప్పారు. ఎన్నికల బరిలో ఉన్న ఏకైక మహిళా అభ్యర్థిగా కూడా పాల్వాయి స్రవంతి ఎమ్మెల్యేగా గెలుపొందాలని భావిస్తున్నారు.

“గత మూడు దశాబ్దాలుగా ఈ గ్రామాలన్నింటిని సందర్శిస్తున్న కాబట్టి ప్రజల బాధలు నాకు తెలుసు. నేను మా నాన్నగారిని చూస్తూ పెరిగాను. ఈ గ్రామాల్లోని మహిళలు నన్ను వారిలో ఒకరిగా భావిస్తారు’’ అని పాల్వాయి స్రవంతి అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌ అభ్యర్థి), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (బీజేపీ అభ్యర్థి) గత ఎనిమిదేళ్లుగా ఎమ్మెల్యేలుగా కొనసాగి మునుగోడు ప్రజలను మోసం చేశారని, మరోసారి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రభాకరరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. రహదారుల నిర్మాణం, నీటి వనరుల భద్రత, ఇంగ్లీషు మీడియం కళాశాలల ఏర్పాటు కలగానే మిగిలిపోయాయి. 2బిహెచ్‌కె లేదా పెన్షన్‌లు కూడా అందించకుండా ఓట్లు ఎలా అడిగారు? ఒక గ్రామానికి రోడ్డు, రేషన్ దుకాణం కూడా లేదు. పింఛను పొందాలంటే చండూరుకు వెళ్లాల్సిందేనని స్రవంతి అన్నారు.

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రజలకు రాజ్‌గోపాల్‌రెడ్డి ద్రోహం చేశారని స్రవంతి రెడ్డి గుర్తుచేశారు. తనను తాను అమ్ముకున్న రాజ్‌గోపాల్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. బిజెపి డబ్బుతో, టిఆర్ఎస్ మద్యంతో ప్రజలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని  స్రవంతి ఆరోపించింది.

Exit mobile version