ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి (Padi Kaushik Reddy) జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు అయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళసై పై కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు రావడంతో మంగళవారం ఆయన ఢిల్లీ వెళ్లారు. జాతీయ మహిళా కమిషన్ ముందు వివరణను ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని కౌశిక్ రెడ్డి Padi Kaushik Reddy చెప్పారు. తెలంగాణ యాసలో మాట్లాడానని.. తాను వాడిన ఒక పదాన్ని పట్టుకొని అంతా రచ్చ చేస్తున్నారని.. అసలు మొత్తం విషయం వింటే తాను కావాలని అన్నానా లేదా అనే విషయం అర్థం అవుతుందని కౌశిక్ రెడ్డి కమిషన్‌కు తెలియజేసినట్లు సమాచారం.
తాను తప్పేం మాట్లాడలేదని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒక వేళ తాను అన్నది తప్పని అనుకుంటే ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోల ఆధారంగా వారిపై ఫిర్యాదు చేస్తానని కూడా కౌశిక్ చెప్పారు. కాగా, జనవరి 26న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ హుజూరాబాద్ (Huzurabad)లో జరిగిన ఒక సమావేశంలో గవర్నర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తొక్కి పెట్టారనే విషయాన్ని మాట్లాడుతూ ఒక అభ్యంతరకరమైన పదాన్ని వాడారు.
గవర్నర్ (Governor) కారణంగా ఒక్క బిల్లు కూడా పాస్ కావడం లేదని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ కార్పొరేటర్ కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత నెల 28న బీసీ పొలిటికల్ జేఏసీ ఇదే విషయంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఆయనను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగ పదవిని కౌశిక్ అగౌరవ పరిచాడని పేర్కొన్నది. కానీ కౌశిక్ (Padi Kaushik Reddy) మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని బదులిచ్చాడు. పాడిపై మహిళా కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: Boy Killed by Street Dogs: హైదరాబాద్ లో దారుణం.. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి!