Telangana Paddy : ధాన్యం కొనుగోలు అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రారంభం

రైతుల సౌకర్యం కోసం ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచారు. గత ఖరీఫ్‌లో 7,139 కేంద్రాలు ఉండగా, ఇప్పుడు వాటిని 8,332కి పెంచారు.

Published By: HashtagU Telugu Desk
Farmers - Paddy

Farmers - Paddy

 హైదరాబాద్: (Telangana Paddy) తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రారంభం కానుంది. ఈ నెలాఖరులో వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి నాలుగు నెలల పాటు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగనుంది. ముఖ్యంగా సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం బోనస్ అందించనుంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

రైతుల సౌకర్యం కోసం ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచారు. గత ఖరీఫ్‌లో 7,139 కేంద్రాలు ఉండగా, ఇప్పుడు వాటిని 8,332కి పెంచారు. సన్న ధాన్యానికి బోనస్ అందించడంతో సాగు విస్తీర్ణం 60.39 లక్షల ఎకరాల నుంచి 65.96 లక్షల ఎకరాలకు పెరిగింది.

పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఇప్పటికే వ్యవసాయం, రవాణా, పోలీస్ శాఖలతో కలిసి సమీక్ష నిర్వహించి, కొనుగోలు ప్రక్రియపై కార్యాచరణ ఖరారు చేశారు. గత ఏడాది 146.28 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, అందులో 91.28 లక్షల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈసారి ఉత్పత్తి అంచనా 159.14 లక్షల టన్నులు ఉన్నా, కొనుగోలు లక్ష్యాన్ని 74.99 లక్షల టన్నులకే పరిమితం చేశారు.

ధాన్యం రకాన్ని బట్టి వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వర్షాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ సూచనలు జారీ చేసింది. ఉదయం 6 గంటలకల్లా వాతావరణ సూచనలను జిల్లా అధికారుల ద్వారా రైతులకు తెలియజేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని టార్పాలిన్ షీట్లు కప్పి, తూకం చేసిన సంచులను కంటైనర్లలో భద్రంగా ఉంచాలన్నారు.

రైతులకు ఏ ఆలస్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవస్థను సిద్ధం చేస్తోంది.

  Last Updated: 21 Sep 2025, 11:03 AM IST