Paddy Politics: వ‌రి రైతుల‌పై పొలిటిక‌ల్ డ్రామా

అధికారం వెల‌గ‌బెట్టే వాళ్లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి. వాళ్లే స‌మ‌స్య‌గా మారినప్పుడు రైతులే కాదు...స‌మాజం అధోగ‌తిపాలు అవుతుంది. ఆ విష‌యం తెలిసి కూడా వ‌రి పండించే రైతు మీద రాజ‌కీయ పార్టీలు నాట‌కం ఆడుతున్నాయి.

  • Written By:
  • Updated On - November 11, 2021 / 03:14 PM IST

అధికారం వెల‌గ‌బెట్టే వాళ్లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి. వాళ్లే స‌మ‌స్య‌గా మారినప్పుడు రైతులే కాదు…స‌మాజం అధోగ‌తిపాలు అవుతుంది. ఆ విష‌యం తెలిసి కూడా వ‌రి పండించే రైతు మీద రాజ‌కీయ పార్టీలు నాట‌కం ఆడుతున్నాయి. ఎవ‌రికి వాళ్లే వ‌రి ధాన్యం కొనుగోలు త‌మ బాధ్య‌త కాద‌ని త‌ప్పుకునే డ్రామాకు ఆయా పార్టీల నేత‌లు తెర‌లేపారు. రాజ‌కీయ ప‌బ్బంగ‌డుపుకోవ‌డానికి అధికార‌, విప‌క్షాలు రైతుల‌పై ప్రేమ‌ను ఒల‌క‌బోస్తున్నారు. కాంగ్రెస్ మిన‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు ధాన్యం కొనుగోలుపై ఆందోళ‌న బాట ప‌ట్టాయి. పోటాపోటీగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పోరుబాట ప‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇక వైఎస్ ష‌ర్మిల ఏకంగా మూడు రోజుల నిరాహార‌దీక్ష‌కు పూనుకుంది.
ధాన్యం కొనుగోలు చేయాల‌ని గురువారంనాడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌కు దిగింది. కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేసింది. కేంద్రం 6,500 కేంద్రాలు పెట్టుకోవ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌గా కేవ‌లం 10వంద‌ల కేంద్రాలు మాత్ర‌మే కేసీఆర్ స‌ర్కార్ ఏర్పాటు చేసింద‌ని దుయ్య‌బ‌డుతోంది. ధాన్యం కొనుగోలు చేయొద్ద‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం చెప్పింద‌ని టీఆర్ఎస్ చెబుతోంది. అందుకే, కేంద్రం నిర్ణ‌యానికి నిర‌స‌న‌గా శుక్ర‌వారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధ‌ర్నాల‌కు దిగాల‌ని శ్రేణుల‌కు పిలుపు నిచ్చింది. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు ధ‌ర్నాల‌ను చేయాల‌ని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదేశించాడు. కామ్రేడ్లు కూడా శుక్ర‌వారం ధ‌ర్నాల‌కు పిలుపు ఇచ్చారు. మ‌హాప్ర‌స్థానం పాద‌యాత్ర‌ను తాత్కాలికంగా ఆపేసిన ష‌ర్మిల హైద్రాబాద్ లోని లోట‌స్ పాండ్ లో మూడు రోజుల నిరాహార‌దీక్ష‌కు కూర్చున్నారు. ధాన్యాన్ని కేసీఆర్ స‌ర్కార్ కొనుగోలు చేయాల‌ని ష‌ర్మిల్ దీక్ష‌లోని డిమాండ్. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ మాత్రం కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : విప్ల‌వం నీడ‌న `గోండుల‌` వ్య‌ధ‌

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రెండో రోజు నుంచే వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా తెర‌మీద‌కు తీసుకొచ్చాయి. ఆ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా ధాన్యం కొనుగోలును ఒక అస్త్రంగా మ‌లుచుకున్నాయి. కేంద్రం కొనుగోలు చేయ‌డానికి ముందుకు రావ‌డంలేద‌ని కేసీఆర్ చెబుతున్నాడు. అందుకు సంబంధించిన ఆర్డ‌ర్ కాపీల‌ను మాత్రం బ‌య‌ట‌పెట్ట‌డానికి సాహ‌సించ‌డంలేదు. స‌రిగ్గా ఇదే పాయింట్ ను బీజేపీ లేవ‌నెత్తుతోంది. కేవ‌లం బాయిల్డ్ రైస్ ను మాత్ర‌మే కొనుగోలు చేయ‌మ‌ని కేంద్రం చెప్పింద‌ని వివ‌రిస్తున్నారు. వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌మ‌ని కేంద్రం ఎక్క‌డ చెప్పిందో చూపించాల‌ని కేసీఆర్ ను నిల‌దీస్తున్నారు.
వాస్త‌వంగా ఉచిత విద్యుత్‌, రైతు బంధు ప్ర‌క‌టించిన త‌రువాత వ‌రి వైపు రైతులు మొగ్గుచూపారు. దానికితోడు ప్రాజెక్టుల‌ను నిర్మించ‌డంతో భూగ‌ర్భ జ‌లాల మ‌ట్టం పెరిగింది. క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర ఇస్తూ ధాన్యం ప్ర‌భుత్వాలు కొనుగోలు చేయ‌డంతో గ్యారంటీ పంట‌గా వ‌రిని రైతులు భావిస్తున్నారు. అందుకే, ఎవ‌రెన్ని చెప్పిన‌ప్ప‌టికీ వ‌రి వేయ‌డానికి రైతులు మొగ్గుచూపుతున్నారు. గ‌త ఏడాది రికార్డ్ స్థాయిలో తెలంగాణ రైతులు వ‌రిని పండించారు. ఆ మొత్తాన్ని కొనుగోలు చేయ‌డానికి టీఆర్ఎస్ స‌ర్కార్ నానా ర‌కాలుగా రైతుల‌ను ఇబ్బందులు పెడుతోంది.

Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు

సాధార‌ణంగా ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేసి, మిల్ల‌ర్ల‌కు స‌ర‌ఫ‌రా చేసే విధానం ఉండేది. దానిలోని లోపాల కార‌ణంగా నేరుగా మిల్ల‌ర్ల‌కు ధాన్యం కొనుగోలు చేసే బాధ్య‌త‌ను కొంత కాలం అప్ప‌గించారు. లెవీ కింద పౌర‌స‌ర‌ఫ‌రాల కోసం బియ్యాన్ని ఎఫ్‌సీఐ సేక‌రించేది. ఆ ప‌ద్ద‌తి కూడా రైతుల‌కు న‌ష్టం క‌లిగిస్తోంద‌ని, లోపాలు ఉన్నాయ‌ని గ్ర‌హించారు. నేరుగా ప్ర‌భుత్వ‌మే కేంద్రాల‌ను ఏర్పాటు చేసి గ‌త కొంత కాలంగా ధాన్యం కొనుగోలు చేస్తోంది.
హ‌ఠాత్తుగా ఏమైందో గానీ, కేంద్రంపై నెపాన్ని నెడుతూ వ‌రి పంట వేయొద్ద‌ని కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌చారం మొద‌లుపెట్టింది. అంతేకాదు, రైతుల వ‌ద్ద నిల్వ ఉన్న యాసంగి పంట‌ను కొనుగోలు చేయ‌కుండా చేతులు ఎత్తేసింది. అందుకు కార‌ణంగా కేంద్రం నుంచి అనుమ‌తులు లేవ‌ని చెబుతోంది. ఇదంతా కేంద్ర‌, రాష్ట్రాలు రైతుల‌పై ఆడుతోన్న ఒక పెద్ద డ్రామా. దాన్ని గ‌మ‌నిస్తోన్న రైతులు క‌ర్రుకాల్చి వాత‌పెడ‌తార‌నే విష‌యం రాజ‌కీయ పార్టీల నేత‌లు గ్ర‌హించాలి.