Paddy Politics : “తెలంగాణ‌” త‌ర‌హా ఉద్య‌మానికి కేసీఆర్ స్కెచ్

కేంద్రంపై దీర్ఘ‌కాలిక పోరాటం చేయ‌డానికి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు. ఆ మేర‌కు క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌కు సంకేతాలిచ్చాడు.

  • Written By:
  • Updated On - November 29, 2021 / 08:30 PM IST

కేంద్రంపై దీర్ఘ‌కాలిక పోరాటం చేయ‌డానికి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు. ఆ మేర‌కు క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌కు సంకేతాలిచ్చాడు. దేశంలోని ఏ రాష్ట్రానికి లేని వ‌రి కొనుగోలు స‌మ‌స్య ఎందుకు వ‌స్తుందో..తెలియ‌చేయ‌డానికి సన్న‌ద్ధం అవుతున్నాడు. ముడి ధాన్యం మాత్ర‌మే కొనుగోలు చేస్తామ‌ని కేంద్రం తెగేసి చెప్పింది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేద‌ని తేల్చేసింది. దీంతో పార్ల‌మెంట్ వేదిక‌గా టీఆర్ఎస్ ఎంపీలు వ‌రి ధాన్యం కొనుగోలుపై ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌తి రోజూ పార్ల‌మెంట్ లో ఇలాగే ఆందోళ‌న చేయాల‌ని పార్టీ చీఫ్ కేసీఆర్ దిశానిర్దేశం చేశాడు. ఇక క్షేత్ర స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు చేయాల‌ని మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు సంకేతాలిచ్చాడు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ రాబోవు రోజుల్లో మోడీ స‌ర్కార్ మెడ‌లు వంచ‌డానికి సిద్ధం అవుతున్నాడు. జిల్లాల్లో ఆందోళ‌న‌లు, పార్ల‌మెంట్ వేదిక‌గా నిర‌స‌న‌లు, ప్ర‌భుత్వం ప‌రంగా కేంద్రంపై అధికారిక ఒత్తిడి..ఇలా మూడు మార్గాల ద్వారా కేంద్రాన్ని రాజ‌కీయంగా బ‌ద్నాం చేయాల‌ని వ్యూహాన్ని ర‌చించాడు. ప్ర‌స్తుతం వ‌రి ధాన్యం కొనుగోళ్లు మంద‌కొడిగా సాగుతున్నాయి. ఖ‌రీఫ్ పంట‌ను ఇంకా కొనుగోలు చేయ‌లేని దుస్థితి. యాసంగి పంట ప్ర‌స్తుతం సిద్ధం అవుతోంది. కేంద్రం, రాష్ట్రం మ‌ధ్య స్ప‌ష్ట‌మైన వైఖ‌రి లేక‌పోవ‌డంతో రైతులు న‌ష్ట‌పోతున్నారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలోని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్ ను క‌లిశారు. వచ్చే రబీ నుంచి బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రానికి ఆ టీం తెలియ‌చేసింది.ప్ర‌స్తుతం ఖరీఫ్ సీజన్‌లో ఎంత వరి ధాన్యాన్ని సేకరించాలనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని మంత్రి నిరంజ‌న్ చెప్పాడు. 45 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరిస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) రాష్ట్రానికి హామీ ఇచ్చిందని, కేంద్రం ఇప్పుడు ఆ అంశాన్ని తప్పించుకుంటోందని ఆరోపిస్తున్నాడు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందన్న రాష్ట్రం వాదనను కేంద్రం న‌మ్మ‌డంలేద‌ని, శాటిలైట్ సర్వే తర్వాత దీనిని అంగీకరించిందని నిరంజన్ రెడ్డి అన్నారు.ఏడాది పొడవునా రెండు పంటల సేకరణ లక్ష్యాలను నిర్ణయించాలన్న డిమాండ్ ను కేంద్రం త్రోసిబుచ్చింది.వ్యవసాయ సమస్యలపై కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదిత కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించాల‌ని రాష్ట్రం టీం కేంద్ర మంత్రి గోయ‌ల్ ను కోరింది. MSP, వార్షిక వ‌రి కొనుగోలు లక్ష్యం, ప్రత్యామ్నాయ పంటలపై సూచనలతో ముందుకు రావాల‌ని టీం విజ్ఞ‌ప్తి చేసింది.
వ‌రి కొనుగోలు అంశం తెలంగాణ రాజ‌కీయాన్ని మ‌లుపు తిప్ప‌నుంది. కాంగ్రెస్‌, బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా వ‌రి కొనుగోలు కేంద్రాల వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగుతున్నాయి. ప్ర‌తిగా టీఆర్ఎస్ పార్టీ కేంద్రంపై దీర్ఘ‌కాలిక పోరుబాట ప‌ట్టాల‌ని యోచిస్తోంది. ఇదే..వ‌చ్చే ఎన్నిక‌ల నాటి ప్ర‌ధాన అస్త్రంగా పార్టీల‌కు మారనుంది.