Site icon HashtagU Telugu

Padayatra Sentiment : వైఎస్ రాజ‌కీయ వార‌సుడు ఆయ‌నే..!

Ys Varasudu

Ys Varasudu

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పాద‌యాత్ర సెంటిమెంట్ ఉంది. పాద‌యాత్ర చేయ‌డం ద్వారా 2004 ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం అయ్యాడు. ఆ రోజున ఆయ‌న‌కు పోటీగా పీ జ‌నార్థ‌న్ రెడ్డి చేసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపు రాలేదు. కానీ, రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉమ్మ‌డి ఏపీలో చేసిన పాద‌యాత్ర క్లిక్ అయింది. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాడు. ఆనాడున్న ప‌రిస్థితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో క‌నిపిస్తోంది. విభజిత ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా చచ్చిపోయింది. తెలంగాణ‌లో మాత్ర‌మే మిణుకుమిణుడు మంటూ వెంటిలేట‌ర్ పై ఉంది. దాన్ని బ‌తికించుకోవ‌డానికి పాద‌యాత్ర అనివార్యంగా కాంగ్రెస్ సీనియ‌ర్లు న‌మ్ముతున్నారు. కానీ, ఎవ‌రు పాద‌యాత్ర‌ను చేయాల‌ని అనే దానిపై మాత్రం ఏకాభిప్రాయం రావ‌డంలేదు.పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పాద‌యాత్ర చేయాల‌ని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాడు. కానీ, సీనియ‌ర్ల తో ఉన్న అనైక్య‌త ఆయ‌న్ను ముందుకు క‌ద‌ల‌నివ్వ‌డంలేదు. ఆయ‌న మాదిరిగానే తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా పాద‌యాత్ర‌కు ప్ర‌ణాళిక‌ను ర‌చించుకున్నాడు. అధిష్టానం అనుమ‌తి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక కాంగ్రెస్ శాస‌న‌స‌భాపక్ష నాయ‌కునిగా ఉన్న భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర‌ను చేస్తున్నాడు. ఆయ‌న విడ‌త వారీగా పాద‌యాత్ర‌లు చేస్తోన్న విష‌యం విదిత‌మే. తాజాగా దీర్ఘకాలిక ప్ర‌ణాళిక‌తో పాద‌యాత్ర‌ను ప్రారంభించాడు. సొంత నియోజ‌క‌వ‌ర్గం మ‌ధిర నుంచి 32 రోజుల పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టాడు. అవ‌స‌ర‌మైతే, రాష్ట్ర వ్యాప్త పాద‌యాత్ర చేస్తాన‌ని సీఎల్పీ నేత‌గా చెబుతున్నాడు. ఆనాడు వైఎస్ కూడా సీఎల్పీ నేత హోదాలోనే పాద‌యాత్ర చేసి సీఎం అయ్యాడు. పైగా భ‌ట్టీ చేస్తోన్న పాద‌యాత్రకు కాంగ్రెస్ సీనియ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త లేదు.

మ‌న ఊరు-మ‌న పోరు పేరుతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బ‌హిరంగ స‌భ‌ల‌కు శ్రీకారం చుట్టాడు. తొలుత శ‌నివారంనాడు ప‌రిగిలో నిర్వ‌హించిన తొలి స‌భ‌ను విజ‌య‌వంతం చేశాడు. ఆయ‌న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రైతు పాద‌యాత్ర‌ను చేశాడు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ లేక‌పోవ‌డంతో అర్థాంత‌రంగా రావిలాల స‌భ‌తో ముగించాడు. ఆ త‌రువాత పీసీసీ అధ్యక్ష ప‌ద‌విని చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి తొలి రోజు నుంచి సీనియ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నాడు. ఆయ‌న వాల‌కం న‌చ్చ‌క‌పోవ‌డంతో చాలా మంది పార్టీని వీడ‌డానికి సిద్ధంగా ఉన్నారని సీనియ‌ర్ల అధిష్టానంకు ఫిర్యాదు చేశారు. ద‌ళిత , గిరిజ‌న దండోర పేరుగా ఆయ‌న నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లు వ్య‌క్తిగ‌త ప్రాప‌కం కోసం అంటూ సీనియ‌ర్లు భావించారు. ఆ మేర‌కు అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. అందుకు త‌గిన విధంగా హుజ‌రాబాద్ ఉప ఫ‌లితాలు కూడా ఉండ‌డంతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి చెక్ పెడుతూ స‌మాంత‌రంగా ఒక క‌మిటీని వేసింది. ఆ క‌మిటీనిక తెలియ‌కుండా ఎలాంటి ప్ర‌చారం, నియామ‌కాలు, స‌భ‌ల‌ను పెట్ట‌డానికి లేదు. దాని ప‌గ్గాల‌ను కోమ‌టిరెడ్డికి అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం.
పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తొలి రోజుల్లో ఎవ‌ర్నీ సంప్ర‌దించుకుండా స‌భ‌లు, స‌మావేశాలు, పోరాటాల‌కు పిలుపునిచ్చాడు. దీంతో సీనియ‌ర్లు ముక్త‌కంఠంతో ఆయ‌న వాల‌కాన్ని వ్య‌తిరేకించారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పనికిరాడ‌ని బాహాటంగా విమ‌ర్శించారు. అడ‌పాద‌డ‌పా కొన్ని స‌భ‌ల్లో సీనియ‌ర్లు రేవంత్ రెడ్డితో క‌నిపించిన‌ప్ప‌టికీ ఐక‌మ‌త్యం ఎండ‌మావిగానే ఉంది. అందుకే, కాంగ్రెస్ లో అంద‌రూ ఒకేసారి పాట‌ను అందుకోర‌ని తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. అంటే, ప‌రోక్షంగా విభేదాల‌ను ఆయ‌న అంగీక‌రించాడు.

ప్ర‌స్తుతం పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత‌ల భ‌ట్టి విక్ర‌మార్క ఆదివారం నుంచి పాద‌యాత్ర చేస్తున్నాడు. సొంత నియోజ‌క‌వ‌ర్గం మ‌ధిర లో ప్రారంభ‌మైన ఈ యాత్ర 32రోజుల పాటు మొత్తం 506 కిలోమీటర్లు సాగనుంది. ముదిగొండ మండలం యడవల్లి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత పాదయాత్ర ప్రారంభించాడు. ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 27న ముగింపు సభ జ‌రిగింది. ప్రతిరోజు 15నుంచి 20 కిలోమీటర్లకుగా పైగా పాదయాత్ర ఉండేలా ప్రణాళిక‌ను ర‌చించాడు.సీఎల్పీ నేత‌గా భ‌ట్టి చేస్తోన్న పాద‌యాత్రకు అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. అవ‌స‌ర‌మైతే, రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర‌కు వెళ‌తాన‌ని చెబుతున్నాడు. అంటే, పరోక్షంగా అధిష్టానం అంగీకారం ఆయ‌న‌కు వ‌స్తుంద‌ని సీనియ‌ర్లు భావిస్తున్నారు. పైగా సీఎల్పీ లీడ‌ర్ కావ‌డంతో సొంత పార్టీ నుంచి వ్య‌తిరేక‌త లేదు. ద‌ళితుల్ని సీఎం చేయాల‌ని సోనియా ఉవాచ‌. ఆ మేర‌కు చాలా కాలం క్రితం ఆమె హామీ ఇచ్చార‌ట‌. తెలంగాణ రాష్ట్రం ఇస్తాన‌ని ఆమె చేసిన వాగ్ధానం ప్ర‌కారం రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ విష‌యాన్ని కేసీఆర్ స‌హా అంద‌రూ అంగీక‌రిస్తారు. ఇప్పుడు ద‌ళిత సీఎంను తెలంగాణ‌కు ఇవ్వాల‌ని సోనియా సంకేతాలు ఇచ్చార‌ని తెలుస్తోంది. అందుకే, భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర‌పై కాంగ్రెస్ సీనియ‌ర్లు అంద‌రూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఈ పాద‌యాత్ర‌కు చేదోడువాదోడుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిలుస్తాడా? లేదా? అనేదిదానిపై కాంగ్రెస్ లో చ‌ర్చ జరుగుతోంది. పాద‌యాత్ర కోసం కోమ‌టిర‌రెడ్డి వెంక‌ట‌రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్ద‌రూ అధిష్టానం వ‌ద్ద ప్ర‌తిపాద‌న ఉంచారు. బ‌హుశా ఎవ‌రికీ రాష్ట్రా వ్యాప్తంగా యాత్ర చేసే అవ‌కాశం ఇవ్వ‌ర‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం భ‌ట్టి చేస్తోన్న పీపుల్స్ మార్చ్ కి మ‌ద్ధ‌తు ప‌లికే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. సీనియ‌ర్ల‌ను కూడా భ‌ట్టీ మార్చ్ కు స‌హ‌కారం అందించాల‌ని సంకేతాలు ఇస్తార‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. ఇలాంటి ప‌రిస్థితుల్లో రేవంత్ , కోమ‌టిరెడ్డి ఏం చేస్తారో ఆస‌క్తిక‌ర అంశం. ఇప్పుడున్న ఈక్వేష‌న్ల ప్ర‌కారం భ‌ట్టీ పాద‌యాత్ర‌కు కోమ‌ట‌రెడ్డి కూడా మ‌ద్ధ‌తు ప‌లికే ఛాన్స్ ఉంది. ఒక్క రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌కు మాత్రం సీనియ‌ర్లు అంగీక‌రించే అవ‌కాశం లేదు. సో..సీఎల్పీ నేత‌గా భ‌ట్టీ మాత్ర‌మే వైఎస్ పాద‌యాత్ర వార‌సునిగా ఫోక‌స్ అయ్యేందుకు అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌.