OU Rejects: రాహుల్ సభకు నో పర్మిషన్!

తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - April 30, 2022 / 04:20 PM IST

తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఓయూ వేదికగా రాహుల్ గాంధీతో సభ నిర్వహించేందుకు టీకాంగ్రెస్ సన్నాహాలు చేసింది. ఇటీవల వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి ఓయూకు వెళ్లడం, అనుమతులు కోరడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు సైతం అనుమతుల కోసం ప్రయత్నించారు. దీంతో ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో  ఓయూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ కలను సాకారం చేసిందనీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంతో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనీ, ఈ మేరకు సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తేల్చి చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో కాలయాపన చేసి, వేలాది మంది విద్యార్థులను బలి తీసుకున్న కాంగ్రెస్ ఏవిధంగా సభ నిర్వహిస్తుందని టీఆర్ఎస్ నాయకులు మండిపడుతుండటంతో.. ఈ ఇష్యూ తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయంశమవుతోంది. అయితే ఓయూలో రాహుల్ సభ ఉంటుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓయూ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాంపస్‌ లో రాహుల్ గాంధీ బహిరంగ సభకు కాంగ్రెస్ అనుమతిని ఉస్మానియా యూనివర్సిటీ నిరాకరించింది. ఈ మేరకు ఓయూ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ సభే కాదు.. వర్సిటీలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించకుండా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు క్యాంపస్‌లో కెమెరాలను నిషేధించారు. సభ ప్ర‌తిపాద‌న‌పై సుధీర్ఘంగా ఆలోచ‌న చేసిన ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్నిల్ రాహుల్ గాంధీ స‌భ‌కు అనుమ‌తిని నిరాక‌రిస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

రాహుల్ గాంధీ పర్యటన సమీపిస్తుండటంతో హనుమకొండలో ఏర్పాట్లను పరిశీలించి పర్యవేక్షించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెంటనే కరీంనగర్ చేరుకున్నారు. మే 6న ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ కరీంనగర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ముందుగా కరీంనగర్‌ పర్యటన జరగనుంది. అక్కడ స్థానిక పార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్ సమావేశం నిర్వహించి రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఇదే విషయమై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి వెంట జీవన్‌రెడ్డి, పొన్నాల ప్రభాకర్‌ ఉన్నారు.

పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు రెండు మండలాల్లో పర్యటిస్తానని చెప్పారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో త్వరలో కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రభాకర్‌ వెల్లడించారు.