Site icon HashtagU Telugu

Liver Transplant: ప్రాణాపాయ స్థితి నుంచి.. పరీక్ష హాల్‌కు!

Liver Transplant

Liver Transplant

Liver Transplant: సరిగ్గా రెండు నెలల కిందట ప్రాణాపాయ స్థితిలో కోమాలో ఉన్న ఓ యువతి.. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరవుతోంది. ఆమెకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (Liver Transplant) చేసి పునర్జన్మను ప్రసాదించిన ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్‌లో తల్లితో పాటు నివాసం ఉంటున్న బ్లెస్సీ గౌడ్ ఈ ఏడాది మే నెలలో జ్వరం బారిన పడింది. చికిత్స కోసం తల్లి ఆమెను ప్రైవేటు హాస్పిటల్‌లో అడ్మిట్ చేయించింది. 5 రోజుల తర్వాత ఆ యువతి కోమాలోకి వెళ్లింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను మే 12న కుటుంబ సభ్యులు ఉస్మానియా హాస్పిటల్‌లో చేర్పించారు. బ్లెస్సీని పరీక్షించిన ఉస్మానియా వైద్యులు, ఆమె లివర్ పూర్తిగా పాడైపోయిందని గుర్తించారు. 48 గంటల లోపల ఆమెకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తేనే బతుకుతుందని, లేదంటే ఆమె చనిపోయే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులకు వివరించారు. కాలెయ దానానికి ఆమె తల్లి, కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు, బ్లెస్సీకి వారి కాలెయం సరిపోలడం లేదని తేల్చారు.

బ్లెస్సీ పరిస్థితిని వివరిస్తూ.. అన్ని ఆధారాలతో లివర్ కోసం జీవన్‌దాన్‌ సూపర్ అర్జంట్ కేటగిరీలో డోనర్ కోసం రిజిస్టర్ చేశారు. జీవన్‌దాన్ సూపర్ అర్జంట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎక్స్‌పర్ట్ టీమ్ ఈ రిక్వెస్ట్‌ను పరిశీలించి, లివర్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో బ్లెస్సీ బ్లడ్ గ్రూప్‌నకు మ్యాచ్ అయ్యే వ్యక్తి బ్రెయిన్ డెత్ అయ్యారు. ఆ వ్యక్తి లివర్‌ను‌, బ్లెస్సీ కోసం జీవన్‌దాన్ కేటాయించింది. మే 12వ తేదీన బ్లెస్సీ ఉస్మానియాలో అడ్మిట్ కాగా.. మే 14వ తేదీన ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెచ్‌వోడీ మధుసూదన్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసింది. రెండు వారాల తర్వాత బ్లెస్సీని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుని, ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎగ్జామ్స్‌కు హాజరవుతోంది. ఈ సందర్భంగా బ్లెస్సీ, ఆమె తల్లి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: IND vs PAK: అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. రేపు భార‌త్‌- పాక్ మధ్య మ్యాచ్‌!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్లెస్సీ, ఈరోజు పరీక్షలకు హాజరవుతుండడం పట్ల ఉస్మానియా డాక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెచ్‌వోడీ మధుసూధన్ శుక్రవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. దేశంలో సూపర్ అర్జెంట్ కేటగిరీలో ప్రభుత్వ హాస్పిటల్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. ఉస్మానియా వైద్యులు, జీవన్‌దాన్ టీమ్ వేగంగా స్పందించడంతో పాటు, బ్లెస్సీ అదృష్టంకొద్దీ సకాలంలో ఆమెకు మ్యాచ్ అయ్యే లివర్ దొరికిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బ్లెస్సీకి పూర్తి ఉచితంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశామని, ఇందుకు సహకరించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎం రేవంత్‌రెడ్డికి మధుసూదన్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్లెస్సీని సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మార్చి, ఆమెకు పునర్జన్మను ప్రసాదించిన ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లతో సమానంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. జీవన్‌దాన్‌ను బలపర్చి, ఆపదలో ఉన్న పేద ప్రజలకు అవయవాలు అందేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గుర్తు చేశారు.