Osmania Hospital: వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో ఉస్మా‘‘నయా హాస్పిటల్’’: మంత్రి

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హాస్పిటల్‌కు వేదిక అవుతున్న గోషామహల్ ప్రజలు ఎంతో అదృష్టవంతులని, ఈ ప్రాంతం పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు.

Published By: HashtagU Telugu Desk
Osmania Hospital

Osmania Hospital

Osmania Hospital: అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్‌ను (Osmania Hospital) రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, కోట్ల మంది ప్రజలు కొత్త ఉస్మానియా కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారని, వారందరి కలను నెరవేర్చుకునే సమయం వచ్చిందన్నారు. హాస్పిటల్ నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని అధికారులకు మంత్రి సూచించారు. తమకు ఉన్న 38 ఎకరాల స్థలంలో, 26.30 ఎకరాలను హాస్పిటల్ కోసం ఇచ్చిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు, గోషామహల్ ప్రజలకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన స్థలంలో పోలీసులు తమ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చునని మంత్రి సూచించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హాస్పిటల్‌కు వేదిక అవుతున్న గోషామహల్ ప్రజలు ఎంతో అదృష్టవంతులని, ఈ ప్రాంతం పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అన్నిరకాల వైద్య సేవలు వాకిట్లోనే అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉస్మానియా హాస్పిటల్‌కు పునర్వైభవాన్ని తీసుకొస్తామన్నారు. 26.30 ఎకరాల విస్తీర్ణంలో, 32 లక్షల స్క్వేర్ ఫీట్ సామర్థ్యంతో విశాలమైన హాస్పిటల్ భవనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ హాస్పిటల్‌ మొత్తం 2 వేల పడకలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా హాస్పిటల్‌లో 22 డిపార్ట్‌మెంట్లు ఉండగా, అదనంగా మరో 8 డిపార్ట్‌మెంట్లు కొత్త ఉస్మానియాలో ప్రారంభిస్తామని తెలిపారు.

Also Read: Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకురండి.. ట్రంప్ ఆదేశం.. మస్క్‌ ప్రకటన

హాస్పిటల్‌లో ప్రతి గదిలోకి గాలి, వెలుతురు వచ్చేలా హాస్పిటల్ భవనాలను డిజైన్ చేయించామని మంత్రి తెలిపారు. హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లకు, స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా హాస్పిటల్‌కు కేటాయించిన స్థలంలోనే నలువైపులా విశాలమైన రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్‌‌లో రెండు అంతస్తులను డిజైన్ చేశామన్నారు. దేశంలోనే అత్యంత విశాలమైన పార్కింగ్ వ్యవస్థ కలిగిన హాస్పిటల్‌గా ఉస్మానియా రికార్డుల్లోకి ఎక్కబోతున్నదన్నారు.

హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా, గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీ, వసతులతో కూడిన మార్చురీని నిర్మించాలని సీఎం రేవంత్‌ రెడ్డిగారు ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

పేషెంట్ల సౌకర్యార్థం అన్ని రకాల డయాగ్నసిస్ సేవలను ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌‌లో ఓపీ సేవలు అందించాలని సూచించారు. పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్ ఉండాలని, కనీసం రోజూ 3 వేల నుంచి 5 వేల మంది పేషెంట్లు వచ్చే అవకాశం ఉన్నందున, ఇందుకు అనుగుణంగా ఓపీ కౌంటర్లు ఉండాలని సూచించారు. ఓపీ కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడే ప్రసక్తే ఉండకూడదన్నారు.

  Last Updated: 30 Jan 2025, 07:22 AM IST