తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా, రొటేషన్ పద్ధతిలో కేటాయించాలని స్పష్టం చేసింది.
తెలంగాణ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపుపై జీవో 46ను విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు ఈ జీవో కీలక సూచనలను చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ పరిమితి రాజ్యాంగబద్ధమైన ఎన్నికల నిర్వహణకు కీలకం కానుంది.
బీసీ రిజర్వేషన్ల నిర్ధారణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. అంటే మునుపటి ఎన్నికలలో రిజర్వ్ చేసిన వార్డులు/గ్రామాలు తిరిగి అదే కేటగిరీకి రిజర్వ్ చేయబడవు. రిజర్వేషన్ల కేటాయింపుకు ప్రామాణికంగా 2011 జనగణన వివరాలతో పాటు SEEPC 2024 డేటాను కూడా వినియోగించనున్నారు. 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలోని అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయబడతాయి.
రిజర్వేషన్లను ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం నుంచి తక్కువ జనాభా ఉన్న ప్రాంతం ప్రకారం కేటాయించాలి. మొదట ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేసి ఆ తర్వాత ఎస్సీ, చివరగా బీసీ కేటగిరీ స్థానాలను కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వార్డు రిజర్వేషన్ల నిర్ణయాన్ని ఎంపీడీవో ఆధ్వర్యంలో, సర్పంచ్ రిజర్వేషన్‌ల నిర్ణయాన్ని ఆర్డీవో ఆధ్వర్యంలో చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 2019 ఎన్నికలలో అమలు కాలేని (నోటిఫై చేయలేని) రిజర్వేషన్లను ఈసారి యథాతథంగా కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు.
గ్రామ పంచాయతీలు లేదా వార్డుల సంఖ్య తక్కువగా ఉన్నచోట ముందుగా మహిళా రిజర్వేషన్లను నిర్ణయించి, ఆ తర్వాత లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించాలని జీవోలో స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్షన్ అథారిటీలను ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమగ్ర రిజర్వేషన్ల ప్రక్రియ త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు పునాది కానుంది. కాగా, డిసెంబర్ తొలివారంలో ఎన్నికల నోటఫికేషన్ వచ్చే ఛాన్సుంది.
