Site icon HashtagU Telugu

Operation Sindoor: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఢిల్లీకి తరలింపు!

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో జమ్ముకాశ్మీర్, పంజాబ్ ప్రాంతాల నుంచి పలువురు తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు దేశరాజధాని ఢిల్లీకి తరలించబడ్డారు. గత శుక్రవారం రాత్రి పంజాబ్‌లో బ్లాక్‌ఔట్ ప్రకటించగా, యూనివర్సిటీలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో విద్యార్థులను తక్షణమే వెళ్లిపోవాలని కాలేజీ యాజమాన్యాలు ఆదేశించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థుల రవాణా ఏర్పాట్లు చేపట్టాయి.

ఈ సందర్భంగా ఢిల్లీకి చేరిన పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాకిస్తాన్‌ రెండు రోజులుగా డ్రోన్‌ దాడులు చేస్తోంది. ఆ డ్రోన్లు మా యూనివర్సిటీ పై నుంచి వెళ్లాయి,” అని తెలిపారు. డ్రోన్లను చూడగానే యూనివర్సిటీ యాజమానం మమ్మల్ని తక్షణమే ఖాళీ చేయాలని చెప్పిందని, అమృత్‌సర్‌, జలంధర్‌ వంటి సున్నితమైన ప్రాంతాల్లో బ్లాక్‌ఔట్‌, రెడ్‌ అలర్ట్‌లు ప్రకటించడం వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని విద్యార్థులు తెలిపారు.

అయితే ఈ డ్రోన్‌ దాడుల వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, పాకిస్తాన్ పంపిన డ్రోన్లను భారత భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని చెప్పారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే సుమారు 2,000 మందికిపైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని సమాచారం. వారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

తెలుగు విద్యార్థుల తరలింపు కోసం చర్యలు:

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లోని యూనివర్సిటీల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రోడ్డు మార్గంలో విద్యార్థులను ఢిల్లీకి తీసుకువచ్చే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఢిల్లీకి చేరిన తర్వాత అక్కడి నుంచి ఆయా రాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇండియా-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవనాల్లో టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఈ నెంబర్లకు పెద్ద సంఖ్యలో కాల్స్‌ వస్తుండగా, ముఖ్యంగా జమ్ము కాశ్మీర్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు సహాయం కోసం సంప్రదిస్తున్నారు. జమ్ము, పంజాబ్‌లో రాత్రి వేళల్లో పరిస్థితి తేలికపాటు కాకపోయినా, ఉదయపు వేళల్లో మాత్రం పరిస్థితి కొంతమేర సురక్షితంగా ఉందని సమాచారం. దీంతో అక్కడి కాలేజీలు తమ విద్యార్థులను బస్సులు, ఇతర వాహనాల ద్వారా ఇంటికి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాయి.

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ, జమ్ము, పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే 2500 మందికిపైగా తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. పంజాబ్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీరిని తిరిగి స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.