Telangana Politics : ఆప‌రేష‌న్ ‘క్విడ్ ప్రో కో’

ఖ‌మ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ వైసీపీ ఎంపీ. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కానీ, ఆయ‌న చురుగ్గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో లేడు.

  • Written By:
  • Updated On - January 24, 2022 / 03:03 PM IST

ఖ‌మ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ వైసీపీ ఎంపీ. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కానీ, ఆయ‌న చురుగ్గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో లేడు. కాంగ్రెస్ వైపు వెళ‌తాడ‌ని పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి రోజుల్లో ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత ష‌ర్మిల తెలంగాణాలో అడుగుపెట్టినప్ప‌టి నుంచి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ‌తాడ‌ని ఊహాగానాలు వెల్లువెత్తాయి. పార్టీ ఆవిర్భావ స‌న్నాహ‌క స‌భ ఖ‌మ్మంలో జ‌రిగింది. ఆ రోజున ఆయ‌న ష‌ర్మిల పార్టీలోకి వెళుతున్నాడ‌ని ప్ర‌చారం విస్తృతంగా జ‌రిగింది. ఇప్పుడు తాజాగా బీజేపీలోకి ఆయ‌న వెళుతున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది.2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆయ‌న గెలుపొందాడు. ఆయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ గెలుచుకుంది. ఆ త‌రువాత శ్రీనివాసరెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు కూడా క్ర‌మంగా టీఆర్ఎస్ గూటికి వెళ్లారు. పైగా 2019 ఎన్నిక‌ల నాటికి కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య సాన్నిహిత్యం బాగా న‌డిచింది. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ విభాగాన్ని జ‌గ‌న్ దాదాపు నిర్వీర్యం చేశాడు. అయిన‌ప్ప‌టికీ శ్రీనివాసరెడ్డి కి ఎంపీ టిక్కెట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి 2019 ఎన్నిక‌ల్లో ల‌భించ‌లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వ‌చ్చిన నామా నాగేశ్వ‌ర‌రావుకు కేసీఆర్ అవ‌కాశం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఎంపీగా ఆయ‌న కొన‌సాగుతున్నాడు. ఫ‌లితంగా శ్రీనివాసరెడ్డి సైలెంట్ అయ్యాడు.

వారం క్రితం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి స‌మావేశం అయ్యాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయ‌ప‌ర‌మైన అంశాలే ఎక్కువ‌గా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. శ్రీనివాసరెడ్డి క‌ల‌వ‌డానికి రెండు రోజుల ముందే మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేక విమానంలో వెళ్లి జ‌గ‌న్ ను క‌లిశాడు. వీళ్లిద్ద‌రూ జ‌గ‌న్ తో భేటీ వెనుక ఒక సారూప్య‌త క‌నిపిస్తోంది. ఏపీ రాజ‌కీయాలు తెలంగాణ కేంద్రంగానూ, తెలంగాణ రాజ‌కీయాలు కొన్ని సంద‌ర్భాల్లో ఏపీ కేంద్రంగానూ న‌డిచిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. ఇక్క‌డే చిరంజీవి, శ్రీనివాసరెడ్డి ఇద్ద‌రూ రెండు రోజులు అటూఇటుగా జ‌గ‌న్ ను ఎందుకు క‌లిశార‌ని ప్ర‌శ్న వేసుకోవ‌చ్చు.మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేక విమానంలో గ‌న్న‌వ‌రం వెళ్లాడు. ఆ విమానం వెనుక న‌డిచిన క‌థ అంతా హైద‌రాబాద్ కేంద్రంగా న‌డిచింద‌ని పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో వినికిడి. పొలిటిక‌ల్ మెగా ఆప‌రేష‌న్ అంతా ప్ర‌గ‌తిమార్గాన న‌డిచింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చిరంజీవిని పంపే ప్ర‌య‌త్నం సీరియ‌స్ గా జ‌రిగింద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్‌, చిరు భేటీ నుంచి అవే వార్త‌లు వ‌స్తున్నాయి. వాళ్లిద్ద‌రి భేటీ వెనుక రాజ‌కీయ‌ప‌ర‌మైన సీరియ‌స్ అంశం ఉంద‌ని తెలుస్తోంది. అందుకు మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోచ్చు. సో..హైద‌రాబాద్ కేంద్రంగా చిరంజీవి పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్ ప్ర‌త్యేక విమానంలో ఎగిరింద‌న్న‌మాట‌.

ఇక తెలంగాణ‌కు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆపరేష‌న్ తాడేప‌ల్లి కేంద్రంగా న‌డిచింద‌ని టాక్‌. జ‌గ‌న్‌, శ్రీనివాసరెడ్డి భేటీ త‌రువాత కొన్ని ఊహాగానాల‌కు తెర‌లేచింది. తెలంగాణ బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళుతున్నాడ‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న గులాబీ గూటిని వ‌దిలి పెట్టి క‌మ‌లంను అందుకోనున్నాడ‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల వినికిడి. ఈ ఆప‌రేష‌న్ వెనుక చాలా జ‌రిగింద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో న‌డుస్తోన్న చ‌ర్చ‌. ప్ర‌స్తుతం పొంగులేటికి ఎలాంటి ప‌ద‌వుల‌ను ఇచ్చే ప‌రిస్థితి టీఆర్ఎస్ పార్టీలో క‌నిపించ‌డంలేదు. పైగా ఖ‌మ్మంలో ఎప్పుడూ క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రాబ‌ల్యం బాగా ఉంటుంది. ఆ సామాజిక‌వ‌ర్గాన్ని కాద‌ని టీఆర్ఎస్ పార్టీ శ్రీనివాసరెడ్డి ని కీల‌కం చేయ‌లేడు.పీసీసీ అధ్య‌క్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాడు. ప్ర‌త్యామ్నాయ పార్టీగా బీజేపీని భావించేలా ప్ర‌జ‌ల మైండ్ సెట్ త‌యారు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా నిర్వీర్యం అయింద‌నే సంకేతాలు ఇస్తున్నాడు. ఆ క్ర‌మంలో శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వైపు చూడ‌కుండా కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడ‌ని ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల భావ‌న‌. అందుకే, తాడేప‌ల్లి కేంద్రంగా సుధాక‌ర్ రెడ్డి ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని తెలుస్తోంది. సో..కాంగ్రెస్ ఆలోచ‌న నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పొంగులేటి త్వ‌ర‌లోనే బీజేపీ గూటికి చేర‌తాడ‌ని జ‌రుగుతోన్న చ‌ర్చ‌కు తాడేప‌ల్లి భేటీ బ‌లం చేకూర్చుతోంది. మొత్తం మీద చిరంజీవి ఆప‌రేష‌న్ హైద‌రాబాద్ నుంచి జరిగితే, తాడేప‌ల్లి నుంచి శ్రీనివాసరెడ్డి ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని తెలుస్తోంది. సో..ఏది ముందుగా రూఢీ అవుతుందో..చూడాలి.