Medaram Jatara 2024 : రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు ఇంకా రెండున్నర నెలల టైమే మిగిలింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు(Medaram Jatara 2024) జరగబోతోంది. ప్రతిసారి జాతరకు కనీసం 100 రోజుల ముందే అభివృద్ధి పనులు, ఏర్పాట్లను ప్రారంభిస్తారు. కానీ ఈసారి ఇంకా పనులు మొదలుకాలేదు. రూ.75 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మొత్తం 21 శాఖలు ప్రతిపాదనలను జులైలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పంపించాయి. అయితే వాటికి ఇంకా మోక్షం లభించలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదం తెలపగానే పనులు మొదలయ్యే అవకాశం ఉంది. మేడారం జాతర కోసం రహదారులు, స్నానఘట్టాలు, కల్యాణ కట్టలు, చెక్‌డ్యాంలు, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, హోల్డింగ్ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, డంప్‌యార్డుల వంటివి నిర్మిస్తుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
అస్తవ్యస్తంగా జాతర ప్రాంగణం
- ఈ ఏడాది జులైలో వచ్చిన వరదలకు సమ్మక్క జాతర ప్రాంగణం అస్తవ్యస్తంగా మారింది.
- తెగిన బ్రిడ్జిలు, కూలిన విద్యుత్ స్తంభాలతో మేడారంలో పరిస్థితి దయనీయంగా మారింది.
- భారీ వర్షాలకు జంపన్నవాగుపై కట్టిన ఘాట్లు కూలిపోయాయి.
- జంపన్నవాగుపై మొట్లగూడెం బ్రిడ్జి కూలిపోగా, గోనెపల్లి బ్రిడ్జి కుంగిపోయింది.
- జంపన్నవాగు పొంగడంతో మేడారంలోని హరిత కాకతీయ హోటల్ పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ 16 రూముల్లో ఉన్న ఏసీలు, ఫ్యాన్లు, మంచాలు, పరుపులు డ్యామేజయ్యాయి. అన్ని రూముల్లో పైకప్పు సీలింగ్‌లు ఊడి కింద పడ్డాయి. జనరేటర్ పాడయ్యింది.
- వరదల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు.
- కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం, ములుగు జిల్లాకు చెందిన సీతక్కకు మంత్రిపదవి దక్కడంతో కొత్త సర్కారుపైనే భక్తులు ఆశలు పెట్టుకున్నారు.