Site icon HashtagU Telugu

CMRF Applications: ఇక నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

CM Revanth Effect

CM Revanth

CMRF Applications: ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF Applications) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో వెబ్ సైట్ ను రూపొందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్ సైట్ ను మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు.

గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పెట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్ సైట్ లో అప్‌లోడ్   చేయాల్సి ఉంటుంది.సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖ ను జత చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తు దారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను  సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ను  సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ ఎఫ్ అప్లికేషన్ ను ఆమోదించి చెక్ ను సిద్ధం చేస్తారు.

Also Read: TPCC : జూలై 7 నాటికి కొత్త టీపీసీసీ చీఫ్‌ని చూడగలమా..?

చెక్ పైన తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ను ముద్రిస్తారు. దీని వల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్ లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.  సైట్ లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.

We’re now on WhatsApp : Click to Join