Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచార‌ణ కొన‌సాగుతోంది. 3వ రోజు కస్టడీలో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల‌ను పోలీసులు విచారించ‌నున్నారు.

  • Written By:
  • Updated On - March 31, 2024 / 07:24 AM IST

Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచార‌ణ కొన‌సాగుతోంది. 3వ రోజు కస్టడీలో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల‌ను పోలీసులు విచారించ‌నున్నారు. కస్టడీ విచారణలో కీలక అంశాలను దర్యాప్తు బృందం రాబ‌డుతున్న‌ట్లు స‌మాచారం. ప్రణీత్ రావ్, రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో రాజకీయ నాయకులను కూడా దర్యాప్తు బృందం విచారించ‌నుంది. ఈ మేర‌కు ద‌ర్యాప్తు అధికారులు న్యాయ స‌ల‌హా తీసుకుంటున్నారు. తిరుపతన్న, భుజంగరావులు వాడిన కంప్యూటర్స్, సెల్‌ఫోన్‌ల‌ను ద‌ర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన‌ట్లు స‌మాచారం. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు తిరుపతన్న, భుజంగరావులు విచార‌ణ‌లో వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం అందుతోంది.

Also Read: Mayank Yadav: ల‌క్నో గెలుపులో కీల‌క పాత్ర పోషించిన అరంగేట్ర బౌల‌ర్‌ మయాంక్ యాద‌వ్‌..!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టై పోలీసు కస్టడీలో ఉన్న భుజంగరావు, తిరుపతన్నల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషించడంపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ట్యాపింగ్‌ అంశాన్ని నిరూపించేందుకు సాంకేతిక ఆధారాల సేకరణ అవశ్యంగా మారడంతో ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారు. ల్యాప్‌టాప్‌‌‌లోని డేటాను తొలగించి ఉండటంతో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిలోని డేటా లభిస్తేనే కేసు దర్యాప్తు ముందుకెళ్లే వీలుంటుందని భావిస్తున్నారు.

టాస్క్ ఫోర్స్, SOT పోలీసులను గత BRS పార్టీ ఎన్నికల్లో డబ్బు రవాణాకు కూడా వాడుకున్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. ప్రముఖ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి BRS ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేయించాలని విచారణ బృందం గుర్తించింది.సోమవారం నాంపల్లి కోర్టులో రాధా కిషన్ రావును వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

అడిష‌న‌ల్ ఎస్పీలు స‌స్పెండ్‌

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ‌ పోలీస్ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇద్దర్ని సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

We’re now on WhatsApp : Click to Join