Site icon HashtagU Telugu

Cadavers Shortage: ఒక్కో డెడ్‌బాడీకి రూ.లక్ష.. మెడికల్ కాలేజీల్లో ‘అనాటమీ’కి శవాల కొరత!

Dead Bodies Shortage Cadavers Shortage Anatomy Private Medical Colleges

Cadavers Shortage: వైద్య విద్యార్థులకు మానవ శరీర నిర్మాణం, అవయవాల పనితీరు గురించి లైవ్‌లో అర్థమయ్యేలా  అనాటమీని బోధించాలంటే డెడ్‌బాడీలు అవసరం. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సరిపడా మృతదేహాలు అందుబాటులోకి రావడం లేదు. దీంతో కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు డబ్బులిచ్చి మరీ దళారులతో డెడ్‌బాడీలను కొనుగోలు చేయిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒక్కో డెడ్‌బాడీ కొనుగోలు కోసం రూ.1 లక్ష దాకా దళారులకు ఇస్తున్నాయట.

Also Read :Missile Capital : ‘మిస్సైల్ క్యాపిటల్’‌గా హైదరాబాద్.. బ్రహ్మోస్, ఆకాశ్ తయారీ ముమ్మరం

ప్రభుత్వ వైద్య కళాశాలలకు సరిపడా..

ప్రభుత్వ వైద్య కళాశాలలకు డెడ్‌బాడీల కొరత దాదాపుగా ఉండదు. అనాథల మృతదేహాలు, రోడ్డు ప్రమాదాల్లో గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన డెడ్‌బాడీలు వాటికి చేరుతుంటాయి. కొందరు తాము చనిపోయాక భౌతిక కాయాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఇవ్వాలని వీలునామా రాస్తుంటారు. అలాంటి డెడ్‌బాడీలు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలకు, ప్రముఖ ప్రైవేటు కాలేజీలకు అందుతుంటాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే అన్‌క్లెయిమ్డ్‌ డెడ్ బాడీలను(Cadavers Shortage) వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం, కొత్త మెడికల్‌ కాలేజీ సంఖ్య పెరగడంతో గత బీఆర్‌ఎస్‌ సర్కారు ఒక కీలకమైన ఉత్తర్వు ఇచ్చింది. అన్‌క్లెయిమ్డ్‌ డెడ్ బాడీస్‌ కోసం నిర్ణీత సమయంలోగా ఎవ్వరూ సంబంధీకులు రాకుంటే, వాటిని మెడికల్‌ కాలేజీల కోసం వినియోగించుకోవచ్చు అనేది ఆ జీవో సారాంశం. దీనివల్ల ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలకు డెడ్‌ బాడీస్‌ కొరత పెద్దగా లేదు.

కొత్తగా వెలిసిన ప్రైవేటు కాలేజీలకు.. 

గత కొన్నేళ్లలో తెలుగు రాష్ట్రాల పరిధిలో  కొత్తగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు పెరిగాయి. వాటిలో అనాటమీ క్లాసుల కోసం సరిపడా మృతదేహాలు దొరకడం లేదు. ప్రైవేటు వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో చేరి  మరణించే కేసులు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆ ఆస్పత్రుల్లో ఎవరైనా మరణించినా, వాటిని పోస్టుమార్టం నిమిత్తం మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రులకే పంపుతారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీల్లో ఉండే అన్‌క్లెయిమ్డ్‌ డెడ్ బాడీలను ఒక్కో దానికి రూ.60 వేలు చొప్పున చెల్లిస్తే వైద్య పరిశోధనల నిమిత్తం ప్రైవేటు వైద్య కళాశాలలకు ఇవ్వొచ్చన్న ప్రభుత్వ జీఓ ఒకటి ఉంది. దాని ఆధారంగా ఇటీవలే తెలంగాణలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు తమకు డెడ్‌బాడీలు కావాలని వైద్యవిద్య సంచాలకులకు దరఖాస్తు చేసుకున్నాయి.

Also Read :24 Fingers Family: ఆ ఫ్యామిలీలో 50 మందికి 24 వేళ్లు.. ఎందుకు ? ఎలా ?

రూల్స్ ఏం చెబుతున్నాయి ? 

మెడికల్ కాలేజీలో ఉండే ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్యకు అనుగుణంగా అనాటమీ విభాగానికి డెడ్‌బాడీలు కావాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) రూల్స్ చెబుతున్నాయి. ప్రతి 25 ఎంబీబీఎస్ సీట్లకు ఒక మృతదేహం అవసరం. ఒకవేళ ఏదైనా మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉంటే.. దానికి ఏడాదికి సగటున 10 డెడ్‌బాడీలు కావాలి. అలా అయితేనే విద్యార్థులకు సక్రమంగా అర్థమయ్యేలా అనాటమీ క్లాసులను నిర్వహించే అవకాశం ఉంటుంది.  అనాటమీ అనేది ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థులకు  ఒక సబ్జెక్టుగా ఉంటుంది. అనాటమీ క్లాసును చెప్పే క్రమంలో మృతదేహాలను కోసి శరీర నిర్మాణం గురించి అర్థమయ్యేలా వివరిస్తారు. ఈవిధంగా కోసిన శవాలను ప్రత్యేక రసాయనాలతో నింపిన ఫార్ములిన్‌ ట్యాంకులలో భద్రపరుస్తారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు అనాటమీ క్లాసులు బోధించేందుకు సరిపడా డెడ్‌బాడీలు అందుబాటులో లేకపోవడంతో.. కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు రబ్బరు బొమ్మలను తీసుకొచ్చి విద్యార్థులకు అనాటమీ పాఠాలు చెబుతున్నాయి.