నేటి నుండి హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో (Nampally Exhibition Ground) ప్రతిష్ఠాత్మకమైన నుమాయిష్ (Exhibition) ప్రారంభం కానుంది. ఈ వేడుకను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. నుమాయిష్ ప్రతి సంవత్సరం వందలాది మంది సందర్శకులను ఆకట్టుకునే కార్యక్రమంగా వెలుగు చూస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభమైందంటే హైదరాబాద్ నగర వాసులకు పండగనే చెప్పుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఈ ప్రదర్శనను సందర్శిస్తారు. ఏడాదిలో ఓసారి జరిగే ఈ ఎగ్జిబిషన్‌కు ప్రతి రోజూ వేలల్లో సందర్శకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో వీరి సంఖ్య మరింత ఎక్కువుగా ఉంటుంది. ఈ సంవత్సరం నుమాయిష్‌లో 2 వేల స్టాళ్లను ఏర్పాటు చేస్తూ, వాణిజ్య, హస్తకళలు, ఆటలు, వినోదం తదితర విభాగాలలో అనేక ఆకర్షణలు ఉంటాయి.
Temperature : ఉమ్మడి మెదక్ జిల్లాను చంపేస్తున్న చలి పులి..!
ఈ ఏడాది నుమాయిష్ సందర్శకులకు మరింత అనుకూలంగా ఉండేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ సందర్శనకు తెరవబడుతుంది. వీకెండ్స్‌లో మాత్రం అదనంగా ఒక గంట సమయం మరింత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఎక్కువ మంది ప్రజలు ఎగ్జిబిషన్‌కు వచ్చే అవకాశం ఉంది. విందు, వినోదాలతో పాటు దుస్తులు, గృహోపకరణాలతో సహా అన్ని రకాల వస్తువులు ఈ ఎగ్జిబిషన్‌లో లభిస్తాయి.
ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము రూ.50 కాగా, ఇది అన్ని వయసుల ప్రజలకు సరళమైన ధరగా నిర్ణయించబడింది. యువత, కుటుంబాలు, పర్యాటకులు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొని సాంస్కృతిక అంశాలను ఆస్వాదించవచ్చు. సామాన్య ప్రజల నుంచి ప్రతిష్టాత్మక వ్యాపార వర్గాలు, ప్రభుత్వం ద్వారా నుమాయిష్ అనేక ప్రాంతాల నుండి విస్తృతంగా ప్రచారం పొందుతుంది. ఈ కార్యక్రమం మూడో తేదీ నుండి జనవరి నెలాఖరులో వరకు కొనసాగుతుంది.
ఈ ఎగ్జిబిషన్ జరిగే రోజుల్లో నాంపల్లి, అసెంబ్లీ, గాంధీ భవన్ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువుగా ఉంటుంది. ఇటువైపుగా సాయంకాలం సమయాల్లో వెళ్తే భారీ ట్రాఫిక్‌లో ఇరుక్కోవల్సి వస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకోవడానికి మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. మెట్రో రైలులో వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకోవచ్చు. బస్సు లేదా ఇతర ప్రయివేట్ లేదా సొంత వాహనాల్లో వెళ్తే ట్రాఫిక్ కారణంగా రాకపోకల కోసం ఎక్కువ సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది.