Site icon HashtagU Telugu

NTR My Mentor: ఎన్టీఆర్ నా గురువు.. తుమ్మల సంచలన కామెంట్స్

Tummala

Tummala

మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. ఆయన ఇటీవల ఖమ్మం జిల్లాలో వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ ఆర్ పేరును ప్రస్తావించి రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం తెప్పించారు. ఎన్టీఆర్‌కు అండగా నిలవడం వల్లే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మందరాజుపల్లి, కొత్తూరులో పర్యటించిన తుమ్మల, అనుచరులు ఏర్పాటు చేసిన సమావేశాల్లో ప్రసంగించారు. ఎన్టీఆర్ తన గురువు అని కూడా ఆయన పేర్కొన్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా నేలకొండ‌పల్లి మండల టీడీపీ క‌మిటీ మ‌ద్ద‌తు తెల్పడం గమనార్హం.

‘‘15 వేల కోట్లతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేశాను. ఎన్టీఆర్ పూర్తి సహకారం అందించారని, కుటుంబ ప్రయోజనాలను పక్కనపెట్టి జిల్లా అభివృద్ధికి కృషి చేశాను. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నేలకొండపల్లికి చెందిన టీడీపీ నేతల నుంచి ఆహ్వానం అందినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తుమ్మల అన్నారు. ఇతర అసెంబ్లీ సెగ్మెంట్ల కంటే పాలేరు సెగ్మెంట్‌ను బాగా అభివృద్ధి చేశానని మాజీ మంత్రి అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల హయాంలో జిల్లాకు నిధులు తెచ్చామన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హయాంలో ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తుమ్మల అన్నారు.

Exit mobile version