Site icon HashtagU Telugu

NTR 100 years : ఎన్టీఆర్ వ్య‌క్తిత్వంపై మాజీ మంత్రి మోత్కుప‌ల్లి లేఖ‌

Ntr 100 Years

Ntr 100 Years

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు (NTR 100 years)జ‌రుగుతోన్న సంద‌ర్భంగా సీనియ‌ర్ పొలిటీషియ‌న్, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు(Mothkupalli Narasimhulu) స్వ‌ర్గీయ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ ఒక బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఎన్టీఆర్ వ్య‌క్తిత్వాన్ని, మాన‌వీయ‌కోణాన్ని తెలియ‌చేస్తూ ఆయ‌న రాసిన లేఖ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఆయ‌న లేఖ య‌థాత‌దంగా ఇలా ఉంది.

“కొందరు మహానుభావులు తనకున్న ప్రతిభతో మెరుగైన జీవనాన్ని పొందగలుతారు. మరికొంత మంది అసాధారణమైన వ్యక్తులు ఎదుటి వారిలోని ప్రతిభను గుర్తించి వారికి సరైన అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు. దీంతో సమాజంలో వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టబడతారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజంలో ఇలాంటి నూతన పరిణామాలకు కేంద్ర బిందువుగా మారి.. కుల,మత, పేద, ధనిక, ప్రాంతీయ భావం లేకుండా ఎందరో అతి సాదారణ, పేద వ్యక్తులను సుస్థిరమైన నిజాయితీగల రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దారు. అందులో నాలాంటి అతి సామాన్యుడు భాగస్వామిగా పాలుపంచుకోవడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన.

  నందమూరి తారక రామారావు సమాజంలో నూతన పరిణామాలకు కేంద్ర బిందువు (NTR 100 years)

పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న నన్ను రాజకీయాలు ఆకర్శించాయి. రాజకీయాల్లో అద్బుతాలు సృష్టించాలన్న దూరదృష్టి లేకపోయినప్పటికి స్వర్గీయ నందమూరి తారక రామారావు సిద్దాంతాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నందున రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. ఆ కోరిక బలపడడంతో 1982వ సంవత్సరంలో ఓ రోజు రామకృష్ణ స్టూడియోలో రాజకీయ సమావేశంలో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. కలిసిన మరుక్షణం నా బయోడేటాను కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఆతర్వాత ఎప్పుడు సంప్రదించాలో కూడా ఆయనే స్వయంగా చెప్పారు. దీంతో మరొక్క సారి స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పిన సమయానికి వెళ్లి సంప్రదించాను. దేశంలో నిరుపేదలు నివసించేందుకు ఇళ్లు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతున్న వారి జీవన విధానాన్ని పాట రూపంలో వేదిక మీద వినిపించాను. నాలోని వేదనను, పాటలోని ఆవేదను గ్రహించిన స్వర్గీయ ఎన్టీఆర్ నన్ను గట్టిగా కౌగిలించుకుని శభాష్ అని ప్రోత్సహించారు. ఆక్షణంలో ఉద్బవించిందే పేదలకు పక్కా గృహనిర్మాణ పథకం. ఆ తర్వాత నుండి రాజకీయాల్లో నేను వెనుతిరిగి చూడనంతగా వెన్నుతట్టి ప్రోత్సహించారు స్వర్గీయ ఎన్టీఆర్.(NTR 100 years)

స్వర్గీయ ఎన్టీఆర్ మంత్రి వర్గంలో రెండు సార్లు మంత్రిగా పనిచేసిన నేను అవినీతిని మాత్రం దరిచేరనీయలేదు. ఏ పని చేయాలనిపించినా స్వర్గీయ ఎన్టీఆర్ నిలువెత్తు ఆహార్యమే మనసులో మెదిలేది. ఇక తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కడుంటుంది.? అంత నిజాయితీగా వ్యవహరిస్తున్న నాకు స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గరుండి వివాహం జరిపించారు. కొత్తగా వివాహం చేసుకున్న నన్ను, నా భార్యను ఇంటికి భోజనానికి ఆహ్వానించి మాతో పాటు భోజనం కూడా చేసారు. ఆ క్షణం నేను పడ్డ సంతోషం ఆనంద బాష్పాల రూపంలో ఉబికి వచ్చింది తప్ప వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. అతి సాధారణ వ్యక్తిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే కాకుండా సమాజంలో ఓ రోల్ మోడల్ గా తిర్చి దిద్దడం ఒక్క స్వర్గీయ ఎన్టీఆర్ కే సాద్యపడిందన్నది నా అభిప్రాయం.

నాలోని వేదనను, పాటలోని ఆవేదను గ్రహించిన  ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో చాలా మంది ఎన్టీఆర్ కు రాజకీయం ఏంతెలుసు అని హేళన చేసారు. చులకనగా చూసారు. ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేసారు. కాని అలాంటి వారే కాల గమనంలో రాజకీయ అజ్ఞానులుగా మిగిలిపోయారు. స్వర్గీయ ఎన్టీఆర్ ను విమర్శించిన వారందరూ రాజకీయ సన్యాసం చేయాల్సి వచ్చింది. అది కళ్ల ముందు జరిగిన సత్యం. ఇదిలా ఉండగా నిస్వార్ధ రాజకీయ సేవ చేయాలనుకున్న పైదవాడిని స్వర్గీయ ఎన్టీఆర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సమసమాజ నిర్మాణం, పేదరికం లేని సమాజం కోసం అన్న ఎన్టీఆర్ ఎంతో శ్రమించారు. అందులోనిండి వచ్చిన వినూత్న ఆలోచనలే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, పక్కా ఇళ్ల నిర్మాణం, రెండు రూపాయలకు కిలో బియ్యం, గురుకుల పాఠశాలలు ఏర్పాటు, మాండలిక విధానం వంటి కార్యక్రమాలు.

Also Read : Junior NTR : TDPలో జూనియ‌ర్ క్రేజ్ డౌన్

1989 సార్వత్రిక ఎన్నికల్లో కొంత మంది ప్రభావంతో స్వర్గీయ ఎన్టీఆర్ నాకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. కాని స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది నేరుగా స్వర్గీయ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి వినమ్రంగా నమస్కరించాను. మరొక్క సారి స్వర్గీయ ఎన్టీఆర్ నన్ను కౌగిలించుకుని పశ్చాత్తాపానికి గురైయ్యారు. ఇలాంటి సంఘటనలన్నీ స్వర్గీయ ఎన్టీఆర్ తో నాకున్న అనుబంధాన్ని మరింతి బలపరిచాయి తప్ప అపోహలకు తావివ్వలేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, పేద వారి సంక్షేమమే లక్ష్యంగా, అవినీతి రహితంగా, స్వచ్చమైన, పారదర్శక రాజకీయం చేసిన నేతగా స్వర్గీయ ఎన్టీఆర్ నా గుండెల్లో ఎప్పటికీ కొలువుంటారు. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా ఆయనతో ఇది నాకున్న అనుబంధంలోని చిన్న అనుభవం మాత్రమే. జై ఎన్టీఆర్.. జైజై ఎన్టీఆర్..!!“ అంటూ మోత్కుప‌ల్లి త‌న లేఖ‌ను ముగించారు.

Also Read : TDP : టీడీపీతోనే బీసీల‌కు న్యాయం – ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు