బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వేడెక్కుతోంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ పిటిషన్ ఆధారంగా శాసనసభ కార్యదర్శి వారికి నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు కేసులపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు. దీనికి వారు మరికొంత సమయం కావాలని ఆయా ఎమ్మెల్యేలు కోరినట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున విజయం సాధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసి, వారిపై అనర్హత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి అధికారికంగా నోటీసులు జారీ చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ కార్యదర్శి తీరు పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులను త్వరగా పరిష్కరించాలని, ఆలస్యం చేయడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరుతూ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.
Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియల్ ఎంక్వైరీ..
మరోవైపు బీఆర్ఎస్ నాయకత్వం తమ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం తమ బలం పెరిగిన నేపథ్యంలో ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం కీలకంగా మారింది. ఈ వ్యవహారంలో శాసనసభ కార్యదర్శి తీసుకునే నిర్ణయం, తదనుగుణంగా కోర్టులో జరిగే పరిణామాలు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.