తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. సిట్ (SIT) విచారణకు హాజరయ్యే ముందు మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తన బామ్మర్దికి సంబంధించిన బొగ్గు కుంభకోణాన్ని (Coal Scam) తాను బయటపెట్టినందుకే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసే ఇటువంటి ‘తాటాకు చప్పుళ్లకు’ తాము భయపడబోమని, తాము కేసీఆర్ తయారు చేసిన ఉద్యమ సైనికులమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా దండుపాళ్యం ముఠా తరహాలో వాటాలు పంచుకుంటున్న వైనాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై ఇటువంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
Phone Tapping
ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పనంగా ధారాదత్తం చేస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో నిలదీసినందుకే వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, మహిళలకు మహాలక్ష్మీ పథకం, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే మున్సిపల్ ఎన్నికల ముందు ఈ కేసులు, విచారణల సీరియల్ నడుపుతోందని ఎద్దేవా చేశారు. గతంలో సర్పంచ్ ఎన్నికల ముందు కేటీఆర్‌కు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు తనకు నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
సింగరేణి బొగ్గు స్కాంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్నట్లు హరీశ్‌రావు వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య కుమ్మక్కు లేకపోతే వెంటనే ఈ కుంభకోణంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నైనీ బ్లాక్ టెండర్లను రద్దు చేయాలని, సింగరేణి నిధులతో ముఖ్యమంత్రి విలాసాలు చేయడంపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా తనపై ఆరోపణలను కొట్టివేశాయని గుర్తు చేశారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళ్తానని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూనే.. రేవంత్ రెడ్డి అవినీతి బండారాన్ని ప్రజల పక్షాన నిరంతరం బయటపెడుతూనే ఉంటామని హరీశ్‌రావు సవాల్ విసిరారు.
