టీఆర్ఎస్ చీఫ్ ప‌ద‌వి కోసం నామినేష‌న్‌.. కేసీఆర్ పేరును ప్ర‌తిపాదించిన 16 మంది సీనియ‌ర్లు

  • Written By:
  • Publish Date - October 18, 2021 / 03:44 PM IST

తెలంగాణ రాష్ట్ర స‌మితి చీఫ్ గా మ‌రోసారి కేసీఆర్ ఏక‌గ్రీవంగా ఎన్నిక కావ‌డానికి రంగం సిద్ధం అయింది. ఆయ‌న పార్టీ అధ్య‌క్షునిగా 2001 నుంచి కొన‌సాగుతున్నారు. ఈనెల 25వ తేదీన జ‌ర‌గ‌బోయే టీఆర్ఎస్ ప్లీన‌రీలో కేసీఆర్ ను అధ్య‌క్షునిగా ఎన్నుకోవ‌డానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. మూడేళ్లుగా పార్టీ ప్లీన‌రీ జ‌ర‌గ‌లేదు. 2018లో అసెంబ్లీ, 2019లో సాధార‌ణ ఎన్నిక‌లు, కోవిడ్ 19 క్ర‌మంలో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈసారి ప్లీన‌రీని అట్ట‌హాసంగా జ‌ర‌ప‌డానికి పార్టీ సిద్ధం అయింది. ఆ మేర‌కు పార్ల‌మెంట‌రీ, శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ల‌తో స‌మావేశ‌మైన కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ త‌ర‌పున సీనియ‌ర్ లీడ‌ర్లు ఆదివారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. టీఆర్ఎస్ పార్టీలోని 14 మంది సీనియ‌ర్లు కేసీఆర్ పేరును ప్ర‌తిపాదిస్తూ రిట‌ర్నింగ్ అధికారి శ్రీనివాస‌రెడ్డికి పేప‌ర్లు అంద‌చేశారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ క‌విత‌, పీవీ కుమార్తె వాణి ఇత‌ర నేత‌లు క‌లిసి నామినేష‌న్ ప‌త్రాల‌ను కేసీఆర్ త‌రపున రిట‌ర్నింగ్ అధికారికి అంద‌చేశారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఈనెల 17వ తేదీన ప్రారంభం అయింది. అక్టోబ‌ర్ 22 వ‌రకు నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. 23న నామినేష‌న్ల ప‌రిశీల‌న ఉంటుంది. షెడ్యూల్ ప్ర‌కారం అక్టోబ‌ర్ 24వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్లు వేసే చివ‌రి రోజు. పార్టీ అధ్య‌క్షుడిని ఈనెల 25వ తేదీన ఎన్నిక చేసుకుంటారు. మూడేళ్ల త‌రువాత జ‌రుగుతోన్న పార్టీ ప్లీన‌రీకి ఈసారి 14వేల ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు.
సంస్థాగ‌త ఎన్నిక‌లను ఈసారి ప‌గ‌డ్బందీగా నిర్వ‌హించారు. స‌భ్య‌త్వాల సంఖ్య అనూహ్యంగా పెరిగిది. గ్రామ స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. మండ‌ల‌, జిల్లా క‌మిటీలు ఏర్ప‌డ్డాయి. తుది ద‌శ సంస్థాగ‌త ఎన్నిక‌ల క్ర‌మంలో ప్లీన‌రీలో కేసీఆర్ ను మ‌రోసారి ఏక‌గ్రీవంగా అధ్య‌క్షునిగా ఎన్నుకోబోతున్నారు. ఏక‌గ్రీవంగా కేసీఆర్ ను చీఫ్ గా ఎన్నుకునే ప్ర‌క్ర‌య అంతా స‌ర్వ‌సాధారణంగా జ‌రిగే ఒక తంతు మాత్ర‌మే. లాంఛ‌నంగా ఈనెల 25న మ‌రోసారి చీఫ్ గా కేసీఆర్ ఎన్నిక అవుతారు.